దురుసుగా ప్రవర్తించిన హెచ్‌ఎం.. దేహశుద్ధి చేసిన యువకులు
పీఈటీ, హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు
నవతెలంగాణ- కల్హేర్
సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువు తున్న ఓ విద్యార్థిని పట్ల అదే పాఠ శాలలో పనిచేస్తున్న పీఈటీ సంగ్రా మ్ గురువారం అసభ్యకరంగా ప్రవ ర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రుల దృష్టికి తీసు కెళ్లారు. దాంతో ప్రధానోప్యాయుడితో చర్చించేందుకు విద్యార్థిని తల్లి దండ్రులు శుక్రవారం పాఠశాలకు వెళ్లి.. జరిగిన విషయాన్ని హెచ్‌ఎం కు వివరిస్తుండగా.. పీఈటీ సంగ్రామ్ జోక్యం చేసుకొని విద్యార్థిని తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ ప్రవర్తనను సైతం ప్రధానోపాధ్యాయుడు సమర్ధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకులు హెచ్‌ఎంను నిలదీశారు. వారిపట్ల దురుసుగా ప్రవర్తించడంతో హెచ్‌ఎంకి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ క్రమంలో స్టేషన్‌లో పనిచేస్తున్న హౌంగార్డు యువకులను అవమానించడంతో.. కోపంలో ఉన్న వారు.. హౌంగార్డుపై దాడి చేశారు. తమకు న్యాయం చేసే వరకు స్టేషన్ ముందు నుంచి కదలబోమని గ్రామస్తులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, మండల విద్యాశాఖ అధికారి శంకర్, కంగ్టి సీఐ రాజశేఖర్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత అధికారి ప్రకటనతో గ్రామస్తులు శాంతించి అక్కడినుంచి వెళ్ళిపోయారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీ సంగ్రామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.