దరఖాస్తు గడువు పెంచండి..

‘బీసీలకు ఆర్థిక సాయం’ దరఖాస్తుపై తమ్మినేని
 మంత్రి గంగులకు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వృత్తి కులాలకు ఆర్థి సహాయం పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఆదివారం లేఖ రాశారు. బీసీ కులాలవారికి వృత్తుల ఆధునీకరణ, పనిముట్లు, ముడిసరుకుల కొనుగోలు కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలిపారు. లక్షలాదిమంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో కులం, ఆదాయం, నివాస ధృవపత్రం, ఆధార్‌, రేషన్‌కార్డులు జతపరచాల్సి ఉన్నందున ఆయా పత్రాల కోసం పేదలు మండల కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారని తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో జనం బార్లు తీరుతున్నారని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని తెలిపారు. వెబ్‌సైట్‌ సమయానికి ఓపెన్‌ కావడం లేదని తెలిపారు. సర్వర్‌డౌన్‌ అవుతుండటం వంటి సాంకేతిక సమస్యలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అర్హులైనవారికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడం కూడా సమస్యగా మారిందని పేర్కొన్నారు. వృత్తిదారుల్లో అనేకమంది నిరక్షరాస్యులు, అత్యంత వెనకబడినవారు కావటం వల్ల దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని తెలిపారు. దీంతో తాము ఆర్థిక సాయం పొందలేమనే ఆందోళనలో వృత్తిదారులున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ ఆఖరు వరకు పొడిగించాలని తమ్మినేని కోరారు.
ఆర్థిక సాయం గడువు పెంచాలి :ఎంవీ రమణ
చేతి వృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ధరఖాస్తుల గడువు పెంచాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎంవీ రమణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేం దుకు కావాల్సిన సర్టిఫికెట్లను తగిన సమయంలో తాహశీల్దాదార్‌ కార్యాలయాలు అందించలేకపో తున్నాయని తెలిపారు. దీంతో వృత్తిదారులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు. దీంతో పాటు లబ్దిదారుల వయోపరిమి తిని 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

Spread the love