మాకూ భూములివ్వండి : కేసీఆర్‌కు కాసాని లేఖ

నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని కోకాపేటలో బీఆర్‌ఎస్‌కు చెందిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూమి కేటాయించిన విధంగా టీడీపీకీ ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గజం రూ.7,500 ధరకు కేటాయిస్తూ 18 మే 2023న జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈనెల మొదటివారంలో భారత్‌భవన్‌ నిర్మాణానికి మీరు శంకుస్థాపన చేస్తూ దేశ విదేశాల్లో రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాల్లో అనుభవజ్ఞులైన గొప్ప మేధావులను, నోబెల్‌ విజేతలను కూడా పిలిచి రేపటి పౌరులకు ఇక్కడ నిర్మించే భవనంలో నాయకత్వ శిక్షణ ఇప్పిస్తామన్నారు. తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసేందుకు కషి చేస్తామని తెలిపారు.ఇక్కడ నిర్మించే 15 అంతస్తుల భవనంలో మిని హాళ్లు, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీలు, వసతి కోసం లగ్జరీ గదులను ఏర్పాటు చేస్తామన్నారని వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీకి సైతం మానవ వనరుల అభివృద్ధి కేంద్ర భవన నిర్మాణానికి కోకాపేటలో గజం రూ. 7,500 లకు 11 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా కోరుతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీతోపాటు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ భూములు కేటాయించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.

Spread the love