పేదలపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లాలో భూ పోరాటం చేస్తున్న ప్రజలపై లాఠీచార్జి చేయడాన్నీ, అక్రమ కేసులు పెట్టడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా సాహెబ్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 71/1లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కొంత కాలంగా పోరాటం జరుగుతున్నదని తెలిపారు. పేదలపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఆ ఘటనలో ఆడవాళ్లు, చిన్నపిల్లలు కూడా గాయపడ్డారని తెలిపారు. 19 మంది(అందులో ఏడుగురు మహిళలు)పై అక్రమంగా కేసులు బనాయించి రాత్రికి రాత్రే అరెస్టు చేసి జైలుకు పంపడం దుర్మార్గమని పేర్కొన్నారు.

Spread the love