రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయండి

 Deposit Rs.10 Crores– డిండి ఎత్తిపోతల పనులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
– కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డిండి ఎత్తిపోతల పనులకు సంబంధించి ఎన్జీటీ విధించిన జరిమానాలో రూ. పది కోట్లను సంబంధిత సంస్థ ఎదుట డిపాజిట్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఉండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పనులు చేపడుతున్నారంటూ కర్నూలు జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేర్వురుగా ఎన్‌జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం గతేడాది డిసెంబరు 22న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.500 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, గతంలో తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా మరో రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.585 కోట్ల జరిమానా విధించింది. ఎన్‌జీటీ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌. వి.ఎన్‌. భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలను విన్నది. డిండి ప్రాజెక్టుకు విధించిన జరిమానాలో రూ. 10 కోట్లను సంబంధిత సంస్థ ఎదుట తెలంగాణ ప్రభుత్వం మూడు వారాల్లో డిపాజిట్‌ చేయాలని, మిగతా జరిమానా వసూలులో ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టిఎంసిల మేర పనులు కొనసాగించుకోవచ్చని, ఎన్‌జీటీ విధించిన రూ. 532 కోట్ల జరిమానాపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ తమ వైఖరి వెల్లడిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై రిజాయిండర్ల దాఖలుకు ప్రతివాదులకు మూడు వారాల గడువును ఇచ్చిన ధర్మాసనం, పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసింది.

Spread the love