నర్సరీలపై నమ్మకమెంత…?

– విస్తరిస్తున్న షేడ్‌నెట్‌ మొక్కల పెంపకం
– కొన్ని నర్సరీల్లో నిబంధనల ఉల్లంఘన

– మొక్కలను తారుమారు చేస్తున్నట్టు ఆరోపణలు
– రాష్ట్రంలో 600కు పైగా మొక్కల పెంపకం కేంద్రాలు
– ఈ ఏడాది 4 లక్షల ఎకరాల వరకూ మిరప సాగు..!
– పత్తి నాటే సీజన్‌ ముగుస్తుండటంతో మిర్చిపై ఆసక్తి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానపంటల సాగులో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా నర్సరీల ఆవశ్యకత పెరుగుతోంది. ముఖ్యంగా మిర్చి సాగు విషయంలో షేడ్‌నెట్‌ నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. వీటి ద్వారా పలువురు ఉపాధి పొందుతున్నారు. నర్సరీల్లో మొక్కల పోషణపై దృష్టి ఎక్కువగా ఉండటంతో చీడపీడల వ్యాప్తి కొంతమేర తక్కువ ఉండటంతో పాటు మొక్కలు ఏపుగా వస్తాయనే నమ్మకం రైతుల్లో పెరిగింది. దశాబ్దకాలంగా ఏటా పదుల సంఖ్యలో నర్సరీలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలోనే అధిక విస్తీర్ణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా నర్సరీలు ఉంటే.. ఉమ్మడి జిల్లాలోనే సగానికి పైగా ఉండటం గమనార్హం.
మిర్చి సాగున్నచోటే నర్సరీలు..
తెలంగాణ వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల వరకూ మిర్చి సాగైతే ఖమ్మం జిల్లాలోనే లక్ష ఎకరాలకు పైగా సాగవుతుందని ఉద్యానశాఖ అంచనా. ఖమ్మం తర్వాత జోగులాంబ గద్వాలలో 35వేలు, జయశంకర్‌ భూపాలపల్లిలో 30వేలు, వరంగల్‌ రూరల్‌లో 27వేలు, భద్రాద్రి కొత్తగూడెంలో 26వేలు, సూర్యాపేటలో 21వేలు మిగిలిన జిల్లాల్లో పదివేల లోపు ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. ఎక్కడైతే మిర్చి సాగు ఉంటుందో ఆ జిల్లాల్లోనే నర్సరీల ఏర్పాటు ఊపందుకుంటోంది.
కొన్ని నర్సరీల్లో నాణ్యతపై సందేహాలు..
గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న నర్సరీలపై ఆధారపడేవారు. దీన్ని ఆసరా చేసుకున్న అక్కడి నర్సరీల నిర్వాహకులు మోసాలకు తెగించారు. డిమాండ్‌ ఉన్న మిర్చి విత్తనాలను అధిక ధరకైనా కొని అక్కడి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం రైతులు ఇచ్చేవారు. ఒకప్పుడు రెడ్‌హార్ట్‌, ఇప్పుడు సెమినిస్‌ ఎస్‌వీహెచ్‌ఏ 2222 తేజా రకం మిర్చి విత్తనాలను ఎక్కువగా ఇస్తున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం రైతు విత్తనాలు ఇస్తే 60 పైసల చొప్పున, నర్సరీల నిర్వాహకులే మొక్కలు పెంచి ఇస్తే ఒక్కోదానికి రూ.1.25 నుంచి సీజన్‌ను బట్టి రూ.8కి పైగా ధరకు విక్రయిస్తుంటారు.
ఈ నేపథ్యంలో రైతు ఇచ్చిన విత్తన రకం మొక్కలు కాకుండా ఇతర రకాలను అంటగట్టి నర్సరీల నిర్వాహకులు బురిడీ కొట్టిస్తున్నట్టు రైతులు పసిగట్టారు. ఇలా ఖమ్మం జిల్లాలో 200కు పైగా, భద్రాద్రిలో 100కు పైన, వరంగల్‌, సూర్యాపేట, వరంగల్‌ రూరల్‌, ములుగు జిల్లాల్లో 10 నుంచి 20కి పైగా నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. అయితే ఏ మోసాలతో రైతులు ఇబ్బంది పడి స్థానిక నర్సరీలను నమ్ముకున్నారో అదే వ్యవహారం ఇక్కడా కొన్ని నర్సరీల్లో మొదలైనట్టు రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాలు, మొక్కలు, ట్రేలు మారుస్తుండటంతో కొన్ని నర్సరీలపై సందేహాలు వస్తున్నాయి.
కల్తీ చేస్తే నర్సరీ చట్టం 2017 ప్రకారం పీడీ యాక్టు..
నర్సరీ చట్టం 2017 ప్రకారం కల్తీనారు విక్రయాలపై చర్యలు తీసుకోవచ్చు. నిబంధనలు పాటించని నర్సరీ నిర్వాహకులకు రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతు రిజిస్టర్‌ నర్సరీ నుంచే నారు తీసుకోవాలి.
బిల్లు జాగ్రత్త పరుచుకోవాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడి నుంచి సేకరించారు, బిల్లు వివరాలు, లాట్‌ నంబర్‌, విత్తనం తయారు చేసిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ, నర్సరీ ప్రధాన ద్వారం వద్ద బోర్డుపై అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక, నారు పెంపకానికి సరైన భూమి ఎంచుకోవడం, పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచడం, మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షేడ్‌ నెట్‌ హౌస్‌, నెట్‌ హౌస్‌, పాలీ టన్నెల్‌, మిస్టూ చాంబర్‌ తదితర మౌలిక వసతులు నర్సరీల్లో కచ్చితంగా ఉండాలి. మొక్కల ఉత్పత్తికి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఏడాదికోసారి ఉద్యాన అధికారులు నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేయాలి. ఎలాంటి లోపాలున్నా సంబంధిత నర్సరీలపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది.
నాసిరకం మొక్కలిస్తే చర్యలు తప్పవు..
జీనుగు మరియన్న, ఉద్యానశాఖ అధికారి,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రైతులు ఇచ్చిన విత్తన రకాలు కాకుండా మార్చి ఇస్తే చర్యలు తప్పవు. గతేడాది పత్తి ధర ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది ఇప్పటికే సమయం మించిపోతున్న దృష్ట్యా మిర్చి ధర బాగుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని నర్సరీ నిర్వాహకులు అధిక ధరలకు మొక్కలు అమ్మినా.. నాసిరకం ఇచ్చినా చర్యలు తప్పవు.
నర్సరీని నమ్మలేక సొంతంగా నారు పోశా…
గతేడాది రెడ్‌హార్ట్‌ విత్తనాలు పది గ్రాముల ప్యాకెట్‌ రూ.750 చొప్పున కొనుగోలు చేసి కృష్ణాజిల్లా మక్కపేట నర్సరీలో ఇచ్చా. నా ముందే ట్రేలో ఆ విత్తనాలు వేశారు. దానికి సంబంధించిన స్లిప్‌ కూడా ఇచ్చారు. తీరా నేను మొక్కలు తెచ్చే సమయానికి వెళ్తే మొక్కల్లో నాణ్యతపై అనుమానం కలిగింది. పంట దిగుబడి కూడా తగ్గింది. నేనిచ్చిన విత్తన రకాలనే నర్సరీల నిర్వాహకులు కేజీల చొప్పున సగం ధరకే కొనుగోలు చేశారు. ఆ విత్తనాల మొక్కలనే నాకు ఇచ్చినట్టు అర్థమైంది. చేసేది లేక ఈ ఏడాది సొంతంగా నేనే నారు పోసుకున్నా.
– తూము సత్యనారాయణ,
రైతు, చిమ్మపూడి, ఖమ్మం

 

Spread the love