నేటి నుంచి రైతుబంధు జమ

– 70 లక్షల మంది రైతు ఖాతాల్లోకి పైసలు
– కొత్తగా ఐదు లక్షల మంది లబ్దిదారుల
– నాలుగు లక్షల ఎకరాల పోడు రైతులకు కూడా… : మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వానాకాలానికి సంబంధించిన రైతుబంధు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దీంతో 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈసారి కొత్తగా ఐదు లక్షల మంది లబ్దిదారులు చేరారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు నాలుగు లక్షల ఎకరాలకు రైతు బంధు అందజేయనున్నట్టు తెలిపారు. మొత్తం రూ.7720.29 కోట్లు రైతు ఖాతాల్లో పడనున్నాయని వెల్లడించారు. గతంలో కన్నా ప్రభుత్వంపై ఈసారి సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. ఈ సారి కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంటు వివరాలతో సంప్రదించాలని కోరారు. వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ప్రత్యేక ధాన్యవాదాలు తెలియజేశారు.

 

Spread the love