– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
– తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
aనవతెలంగాణ-ముదిగొండ
అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని మచ్చా వీరయ్య భవనం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు గృహలక్ష్మి పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని వారందరికీ ప్రభుత్వం 125 గజాల స్థలం కేటాయించి, ఇంటి పట్టాను అందించాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు స్థలాలను క్రమబద్దీకరణ చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. రేషన్ కార్డులు, నూతన పెన్షన్లు నేటి వరకూ ఇవ్వలేదన్నారు. అనంతరం తహసీల్దార్ జి.శిరీషకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండి పద్మ, వాసిరెడ్డి వరప్రసాద్, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, సీఐటీయూ మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి కొలేటి ఉపేందర్, సీపీఐ(ఎం) నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.