పోడుపట్టాదారులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు

ఖమ్మం, పాల్వంచలో పోడుపట్టాల పంపిణీలో.. మంత్రులు హరీశ్‌ రావు, పువ్వాడ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేసిన రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ పథకాలను వర్తించే విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోడు రైతులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోడు పట్టాలను మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజరు కుమార్‌ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఖమ్మం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజక వర్గాల్లోని 77 గ్రామ పంచాయతీలు, 9 మండలాల పరిధిలో ఉన్న 6589 మంది పోడు రైతులకు 13,139.04 ఎకరాలకు సంబంధించి పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సుగుణ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన సభలో జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో ముందుగా గురువారం అకాల మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ వేద సాయిచంద్‌కి సంతాపం తెలిపారు. అనంతరం మంత్రులు మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4.06 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ పోడు భూములపై గిరిజనులకు సర్వహక్కులు ఉంటాయని చెప్పారు. అలాగే, ఈ భూములు వారసత్వంగా కూడా సంక్రమించే హక్కు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 2471 గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. 2005లో రూపొందించిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం మేరకు పోడు భూములు సాగుచేస్తున్న వారిని హక్కుదారులుగా పట్టాలు ఆందజేసినట్టు తెలిపారు. పట్టాలు పొందిన వారికి రైతుబంధు, రైతుబీమా తదితర అన్ని ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. కాగా, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో 4541 మందికి 15311.27ఎకరాలు, భద్రాచలంలో 6,515 మందికి 16211.02 ఎకరాలు, ఇల్లందులో 12,347 మందికి 36,588.37 ఎకరాలు, పినపాకలో 15962 మందికి 52,438.39 ఎకరాలు, అశ్వారావుపేటలో 9,418మందికి 25,817.15 ఎకరాలు, వైరాలో 1,812 మందికి 4,826.40 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వర రావు, హరిప్రియ, రాములునాయక్‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్‌, అనుదీప్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌, రాష్ట్ర విత్తనాభివద్ది సంస్థ చైర్మెన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ రాయల శేషగిరిరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మెన్‌ బచ్చు విజరు కుమార్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love