‘సంగమేశ్వర’ పూర్తయితే బీడు భూములుండవ్‌..

– వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
– ఎత్తిపోతల నిర్మాణానికి భూమిపూజ
నవతెలంగాణ-మునిపల్లి
సంగమేశ్వర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో బీడు భూములుండవని.. అంతా సాగులోకి వస్తుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడ గ్రామంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు ఈ ప్రాంతంలో కనీసం తాగునీరు లేని దుస్థితి ఉండేదని, నేడు ఇదే ప్రాంతంలో సాగునీటికి ప్రాజెక్ట్‌లు కడుతున్నామని చెప్పారు. సంగమేశ్వర పథకం ఏడాదిలో నిర్మాణం పూర్తి అవుతుందని, దాంతో అంతా సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో సింగూరు, గోదావరి నీళ్లను తీసుకొచ్చారన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి రూ.2653 కోట్లతో సంగమేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఇది పూర్తయితే రెండు లక్షల 19 వేల ఎకరాల సాగు జరుగుతుందన్నారు. ఇంతకాలం ఇక్కడ వర్షా ధారంపైన ఆధారపడి పత్తి, మక్కజొన్న పంటలు వేసేవారని.. వర్షం సరిగా లేకుంటే అవి కూడా ఎండిపోయేవన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయితే ఏడాదికి రెండు పంటలు పండుతాయని చెప్పారు. సింగూర్‌ నీళ్లుమెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల బిడ్డలకు దక్కాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏడాదిలో పూర్తి అవుతుందని.. బీడు భూములు ఉండవని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందించి.. కరువు ప్రాంతాన్ని మెతుకు ప్రాంతంగా మారుస్తా మన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ స్థానికుడని, చురుకుగా పని చేసే వ్యక్తి అని అన్నారు. ఇక్కడే ఉంటూ ప్రజల మధ్యలో ఉండి సాధారణ జీవితాన్ని గడుపుతున్న క్రాంతిని మరోమారు గెలిపించాలని ప్రజలను కోరారు.

Spread the love