కళ్లుండీ చూడలేదు… చెవులుండీ వినలేదు

Eyes have not seen... ears have not heard
**EDS: IMAGE VIA @SpokespersonECI POSTED ON MAY 8, 2024** New Delhi: Chief Election Commissioner (CEC) of India Rajiv Kumar with Election Commissioners Gyanesh Kumar and Sukhbir Singh Sandhu during a review meeting for preparedness ahead of the fourth phase of Lok Sabha elections, in New Delhi. (PTI Photo) (PTI05_08_2024_000188B)

– కోడ్‌ ఉల్లంఘనలపై గప్‌చుప్‌
– పాలకపక్షంపై ఈగ వాలనివ్వదు
– ఈసీ పనితీరుపై ప్రజల్లో సడలుతున్న విశ్వాసం
– యాప్‌ పనిచేయదు… చేసినా సమాధానం రాదు
– ఈ-మెయిల్‌కూ స్పందనుండదు
– ఎన్‌జీఆర్‌ఎస్‌ పనితీరూ డిటో డిటో
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పాలక పక్షానికి వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కళ్లుండీ చూడనట్లు, చెవులుండీ విననట్లు ప్రవర్తిస్తోంది. ఈసీ అట్టహాసంగా ప్రారంభించిన సీవిజిల్‌ యాప్‌ పనితీరు దారుణంగా ఉంది. అందులో ఫిర్యాదులే నమోదు కావడం లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి నమోదైనా సమాధానం రాదు. ఫిర్యాదుల నమోదు కోసం ఉద్ద్దేశించిన ఎన్‌జీఆర్‌ఎస్‌ పనితీరు కూడా సేమ్‌ టు సేమ్‌. పోనీ ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేద్దామంటే దానికీ జవాబు ఇవ్వరు. మరి కోడ్‌ ఉల్లంఘనల గురించి ఎవరికి చెప్పుకోవాలి?
కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేస్తూ, ముస్లిం మైనారిటీలను కించపరుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 21న రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో చేసిన ఎన్నికల ప్రసంగానికి సంబంధించిన వీడియోను పూనేకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అంకిత్‌ శుక్లా చూశారు. ఆయన గతంలో ఎన్నడూ ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయలేదు. కానీ మోడీ ప్రసంగాన్ని విన్న రోజు రాత్రే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఆయన ఈ-మెయిల్‌ పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషం, మతోన్మాదం అనే విషంతో మనసును నింపుకున్న వ్యక్తిని ఎన్నికల్లో పాలుపంచుకునేందుకు అనుమతించకూడదు’ అని అందులో సూచించారు. అయితే శుక్లాకు ఇప్పటి వరకూ ఈసీ నుండి సమాధానమే రాలేదు.
హద్దులు దాటినా చర్యలు లేవు
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని హద్దులూ దాటి ప్రతిపక్షాలపై నిందారోపణలు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లును రద్దు చేసి వాటిని ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మరోవైపు ముస్లింలను కించపరిచే వీడియోలను సామాజిక మాధ్యమాలలో బీజేపీ ప్రచారంలో పెడుతోంది. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్‌ కంటికి ఇవేమీ కన్పించడం లేదు. విద్వేష ప్రసంగాలు చెవులకు విన్పించడం లేదు. హిందూత్వ పార్టీ బాహాటంగా కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మౌనం వహిస్తోంది.
స్పందన లేదు
విద్వేష ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో విసిగి వేసారిపోయిన సాధారణ పౌరులు తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని వేడుకుంటూనే ఉన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై సీ విజిల్‌ యాప్‌, నేషనల్‌ గ్రీవెన్స్‌ రెడ్‌రెసల్‌ సిస్టమ్‌ (ఎన్‌జీఆర్‌ఎస్‌) ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఈసీ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది. కానీ ఈ రెండూ పని చేస్తున్న దాఖలాలు లేవని ‘స్క్రోల్‌’ పోర్టల్‌ తేల్చింది. ఒకవేళ ఫిర్యాదును స్వీకరించినా స్పందన పేలవంగా ఉంటోందని తెలిపింది.
పనిచేయని సీ విజిల్‌
సీవిజిల్‌ యాప్‌ను ఎన్నికల కమిషన్‌ 2018లో ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పౌరులు అందులో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఈ యాప్‌లో పౌరులు చిత్రాలు, ఆడియోలు, వీడియోల ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అయితే ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ ఫోన్లలో పనిచేయడం లేదు. ఆండ్రాయిడ్‌లో అయితే స్క్రీన్‌ ఓపెన్‌ చేసినప్పుడే సమస్య ఎదురవుతోంది. లాగిన్‌ పేజీలో ఫిర్యాదును నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. బన్స్‌వారాలో మోడీ ప్రసంగం విన్న తర్వాత సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించానని ప్రముఖ బిజినెస్‌ జర్నలిజం వెబ్‌సైట్‌ సంపాదకుడు ఉజ్వల్‌ నానావతి తెలిపారు. అయితే అది పనిచేయడం లేదని, స్క్రీన్‌ ఓపెన్‌ చేయగానే హ్యాంగ్‌ అయిందని చెప్పారు.
యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వెబ్‌సైట్‌లో సీ విజిల్‌ యాప్‌కు 1.9/5 రేటింగ్‌ వచ్చింది. 140 మంది యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. దాని పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యాప్‌ హఠాత్తుగా షట్‌డౌన్‌ అవుతోందని ఓ యూజర్‌ చెప్పారు. మూడు దశల పోలింగ్‌ పూర్తయిన తర్వాత కూడా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని ‘స్క్రోల్‌’ తెలిపింది. ఒకవేళ ఫిర్యాదును యాప్‌లో నమోదు చేసినా సమాధానం వస్తుందన్న నమ్మకం లేదు. దీంతో కొందరు అసలు ఆ యాప్‌ వైపు చూడడమే మానేశారు. ఏప్రిల్‌ 21న మోడీ ప్రసంగం తర్వాత చాలా మంది ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్స్‌ ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఈ-మెయిల్స్‌ పంపారు. అయితే వేటికీ జవాబు రాలేదు.
ఈ-మెయిల్‌కూ సమాధానం రాదు
కోడ్‌ ఉల్లంఘనలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే ఈసీ దృష్టికి తేవాల్సి వస్తోందని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ వ్యవస్థాపక సభ్యుడు జగదీప్‌ చోకర్‌ చెప్పారు. అయితే దాని స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-మెయిల్స్‌ ద్వారా ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకున్న పాపాన పోవడం లేదని, దీంతో కొందరు పట్టువదలని విక్రమార్కుల్లా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ నెల రోజుల సమయం తీసుకుంటుందని, ఫలితంగా ఎన్నికలపై ప్రభావం ఏమీ కన్పించదని అన్నారు. 2022లో జరిగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై చోకర్‌, మరికొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత ఈసీ నుండి వారికి సమాధానం వచ్చింది. అమిత్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని దాని సారాంశం.
ఎన్‌జీఆర్‌ఎస్‌ తీరూ అంతే…
సీ విజిల్‌ యాప్‌ పని చేయకపోవడంతో చాలా మంది ఎన్‌జీఆర్‌ఎస్‌ను ఆశ్రయించారు. అయితే అందులో ఫిర్యాదుతో పాటు ఫోన్‌ నెంబర్‌, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీని పని తీరును తెలుసుకోవడానికి ‘స్కోల్‌’ పోర్టల్‌ రిపోర్టర్‌ ఓ ఫిర్యాదు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నాటక బీజేపీ షేర్‌ చేసిన ఓ వీడియోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదును పరిష్కరించామంటూ ఆ మరునాడే సమాధానం వచ్చింది. తీరా దానిని పరిశీలిస్తే కర్నాటక రాష్ట్ర వెబ్‌సైటులో ఫిర్యాదు నమోదు చేయాలని సలహా ఇచ్చారు. కర్నాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైటులో ఫిర్యాదుల నమోదుకు ఓ ఆప్షన్‌ ఉంది. అయితే అందులో నమోదైన ఫిర్యాదులను అది నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీస్‌ పోర్టల్‌కే పంపుతుంది.
ఏదేమైనా ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో నమ్మకం క్రమేపీ సడలిపోతోంది. గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసం 51 శాతం నుండి 28 శాతానికి పడిపోయిందని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ గత నెలలో విడుదల చేసిన ప్రీ-పోల్‌ సర్వేలో తేలింది.

పుణ్యకాలం గడిచిన తర్వాత…
బన్‌స్వారాలో మోడీ చేసిన ప్రసంగంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్నికల కమిషన్‌ నోటీసు పంపింది. అందులో ఎక్కడా మోడీ పేరు లేదు. ముస్లింలను పరాన్నజీవి అయిన కోడిగా చూపుతూ కర్నాటక రాష్ట్ర బీజేపీ హ్యాండిల్‌ ఈ నెల 3న ఒక కారికేచర్‌ వీడియోను పోస్ట్‌ చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నుండి ‘నిధుల’ దాణా అందుకున్న తర్వాత ఆ కోడి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలను గూడు నుండి బయటకు తరిమేసినట్టు అందులో చిత్రించారు. ఈ కారికేచర్‌పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈసీ పట్టించుకోలేదు. కర్నాటకలో పోలింగ్‌ పూర్తయ్యే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతే తప్ప బీజేపీపై ఎలాంటి చర్యలు లేవు.

Spread the love