సివిల్‌ సర్వీసుల స్వభావాన్ని మార్చే యత్నం

–  బీజేపీ సర్కారుపై మాజీ బ్యూరోకాట్ల ఆరోపణ
– భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు
80 మందికి పైగా మాజీ సివిల్‌ సర్వెంట్ల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : దేశంలో సివిల్‌ సర్వీసుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును మాజీ బ్యూరోక్రాట్లు తప్పుబట్టారు. సివిల్‌ సర్వీసుల స్వభావాన్ని మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రానికి రాజభక్తిని ప్రదర్శించేలా తమపై ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు. ప్రత్యేకించి ఐఏఎస్‌, ఐపీఎస్‌ సర్వీసుల విషయంలో ఇది కనిపిస్తున్నదని వివరించారు. ఈ మేరకు 80 మందికి పైగా మాజీ సివిల్‌ సర్వెంట్లు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహిరంగ లేఖను రాశారు. కేంద్రం చెప్పినట్టు చేయకుంటే సదరు ఉన్నతాధికారులపై ఏకపక్షంగా శాఖాపరమైన చర్యలు చోటు చేసుకున్నాయని వివరించారు. సంబంధిత అధికారులు, వారి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా కేంద్ర డిప్యూటేషన్‌లను నిర్బంధించటానికి కేంద్రం సర్వీసు నిబంధనలను సవరించాలనుకుంటున్నదని ఆరోపించారు. రాజ్యాంగ అధిపతిగా మీరు మా బాధలను కేంద్రానికి తెలిజేయాలని కోరుతున్నామని లేఖలో వారు పేర్కొన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ స్వభావాన్ని మార్చే ఈ ప్రయత్నం తీవ్ర ప్రమాదంతో కూడుకున్నదని వారిని(కేంద్రాన్ని) హెచ్చరించాలని కోరారు. అయితే, రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను కట్టడి చేయడానికి ఈడీ, సీబీఐ వంటి సంస్థలను తన రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నదన్న వస్తున్న ఆరోపణలకు మాజీ సివిల్‌ సర్వెంట్ల లేఖ ఇందుకు రుజువు అని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.

Spread the love