– కేంద్రానికి మినహాయింపులు ఆందోళనకరం :
వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుపై జస్టిస్ శ్రీకృష్ణ
న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించిన ముసాయిదా బిల్లులోని అన్ని సెక్షన్ల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిమండలి ఈ నెల ఐదున ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం… తమ అంగీకారం లేకుండా ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నారని భావిస్తే (ఉదాహరణకు సెల్‌ఫోన్ నెంబర్లు లేదా ఆధార్ వివరాలు) ప్రజలు డాటా ప్రొటెక్షన్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ బోర్డులో సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లును ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెడుతుందా లేదా అనే విషయం తెలియరాలేదు.
అయితే బిల్లు నుంచి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సంస్థలను మినహాయించడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ శ్రీకృష్ణ తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రభుత్వానికి అధిక వెసులుబాటు ఇస్తోందని, ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించే చర్యలేవీ ఇందులో పెద్దగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులను ఈ బిల్లు హరిస్తోందని విమర్శించారు. డాటా ప్రొటెక్షన్ బోర్డు కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని, దానికి స్వతంత్రత లేదని అన్నారు. 2018లో తాను రూపొందించిన మొట్టమొదటి ముసాయిదా బిల్లులో స్వతంత్ర డాటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటుకు సిఫారసు చేశానని గుర్తు చేస్తూ అలాంటి స్వతంత్ర సంస్థ అవసరం ఉన్నదని సూచించారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బోర్డు ప్రభుత్వం చేతిలో బందీ అని అన్నారు. గత బిల్లు కంటే ఇది ఘోరంగా ఉన్నదని అంటూ మినహాయింపులు ఇస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు.