జూన్‌ 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీ

– రాహుల్‌ గాంధీ ,ఏచూరి సహా పలువురు కీలకనేతల హాజరు
– సార్వత్రికంలో ఆ వంద సీట్లపై నితీశ్‌ గురి..?
పాట్నా: పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ముహుర్తం ఖరారైంది. జూన్‌ 23న జరగనుంది. గతంలో జూన్‌ 12న జరగాల్సిన సమావేశం ఇప్పుడు జూన్‌ 23న జరుగుతుందని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ , జేడీయూ అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ బుధవారం తెలిపారు. ఇందులో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లు కూడా పాల్గొననున్నారు.. అందరి అంగీకారంతో సమావేశం తేదీని ఖరారు చేశారు. సీతారాం ఏచూరి, డి రాజా, దీపాంకర్‌ భట్టాచార్య వంటి వామపక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
నితీశ్‌ చొరవతో..
ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి నితీశ్‌ కుమార్‌ చొరవతో ఈ సమావేశం నిర్వహించబడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 2022 నుంచి నితీశ్‌ కుమార్‌ ప్రతిపక్ష పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసిన తర్వాత మే నెలలోనే ఢిల్లీకి తిరిగి వచ్చారు. నితీశ్‌ కుమార్‌ తన రాజకీయ శక్తిని, ప్రతిపక్ష పార్టీలతో కలిసి…ఐక్యత చాటాలని మొదటిసారి ప్రయత్నిస్తున్నారు. బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాల సమావేశ కార్యక్రమం పాట్నాలో జరుగుతుందని చెప్పారు. ఇది నితీష్‌, లాలూజీల కృషి, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి. నితీశ్‌తో పాటు నేను చాలా మంది నేతలను కలిశాను. దేశంలో అవలంభిస్తున్న నియంతృత్వ వైఖరిని దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం కీలకం కానుంది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. అయితే ఈ విపక్షాల సంఘీభావ సభకు కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌ మాత్రం హాజరుకాకపోవటం గమనార్హం..
ఆ 100 సీట్లలో బీజేపీని ఓడిస్తే…?
బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని నితీశ్‌ కుమార్‌ పదే పదే పునరుద్ఘాటించారు. కేవలం 100 స్థానాల్లోనే బీజేపీని ఓడించాలి. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు, పట్టు ఉన్న రాష్ట్రాల్లో మహాకూటమి ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ఒక్క అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ప్రధానంగా యూపీలో 80, బీహార్‌లో 40, బెంగాల్‌లో 42, మహారాష్ట్రలో 48, ఢిల్లీలో 7, పంజాబ్‌లో 13, జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో వంద స్థానాల్లో బీజేపీని కట్టడి చేస్తే..బీజేపీయేతర ప్రభుత్వం ఢిల్లీ గద్దెనెక్కటం ఖాయమని బీహార్‌ సీఎం భావిస్తున్నారు.

Spread the love