వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు

– పలు కమిటీలు, కమిషన్లు ప్రతిపాదనలూ చేశాయి
– ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు, దేవెగౌడ చర్యల మీద స్పందించరా?
– మోడీని ప్రశ్నిస్తున్న మేధావులు, విశ్లేషకులు
కర్నాటక, ఏపీ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో 1990వ దశకంలో వరుస కమిటీలు, సామాజిక న్యాయ కమిషన్‌లు వారి కోసం నిశ్చయాత్మక చర్యలను సిఫారసు చేసిన తర్వాత కొన్ని ముస్లిం సమూహాలకు ఓబీసీలలో రిజర్వేషన్‌లో చిన్న వాటా దక్కిందని మేధావులు గుర్తు చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలన్న తన మిత్ర పక్షాలైన చంద్రబాబు నాయుడు, దేవెగౌడ డిమాండ్లపై ఇప్పుడు ప్రధాని స్పందించాల్సిన అవసరం ఉన్నదని వారు అంటున్నారు.
ముస్లింలకు రిజర్వేషన్‌ అంశంపై చంద్రబాబు మాట్లాడితే.. దానికి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ లాలూను వ్యతిరేకించిన విధంగా ఎందుకు చేయలేదనీ, ఇది కాషాయపార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం కోటా ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై ప్రతి ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మొదలుకొని కింది స్థాయి నాయకులు, కార్యకర్తల వరకు దీనిపై పెద్ద దుష్ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదనీ, ముస్లింలకు కోటాను కల్పించేది లేదనీ తెగేసి చెప్తున్నది బీజేపీ పరివారం. అయితే, బీజేపీ చెప్తున్నట్టుగా ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్‌ అనేది ఆ వర్గంలోని వెనకబడినవారికేననీ, వెనకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించబడ్డాయని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.
కర్నాటకలో ముస్లింలను ఓబీసీలో చేర్చటంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నది. అయితే, బీజేపీ ప్రస్తుత మిత్ర పక్షం జేడీ(ఎస్‌)1994లోనే ముస్లిలంకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో కర్నాటక సీఎంగా ఉన్న దేవెగౌడ ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రం ఏపీలోని బీజేపీ మిత్రపక్షం టీడీపీ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నది. ఇతరులపై వేలెత్తి చూపే ముందు ఒక విషయంలో ఉన్న హేతుబద్దత గురించి ఆలోచించాలనీ, ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తే.. దేశంలోని ఒక వర్గాన్ని విస్మరించినట్టవుతుందనీ, ఇది ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని మేధావులు చెప్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో మోడీ కాంగ్రెస్‌పై దాడి చేస్తూ ఒక వర్గం భారతీయులు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటూ సంభోదించారు. మరొక సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ హిందువుల సంపదను వేరే వర్గం వారికి పంచిపెడుతుందని ఆరోపించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తీసేసి దానిని వేరే వర్గం వారికి కేటాయిస్తున్నారని ప్రజల్లో విభజన తీసుకొచ్చి విష బీజాలు నాటే ప్రయత్నం చేశారని మేధావులు చెప్తున్నారు. చాలా ఎన్నికలలో ఏదో ఒక అంశంపై ఆ ఒక్క వర్గాన్నే టార్గెట్‌ చేసుకోవటం, ఇతర వర్గాల్లో ఆందోళనను రేకెత్తించి గంపగుత్తగా ఓట్లు పొందటమే బీజేపీ, ప్రధాని ఉద్దేశమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూనే ఒక వర్గంపై బీజేపీ తీవ్ర దుష్ప్రచారాన్ని చేసిందని అంటున్నారు.
లాలూకు వ్యతిరేకం.. చంద్రబాబుపై మౌనం
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ బీహార్‌లోని విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన ప్రకటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అనుకూల మీడియా కూడా ఎప్పటిలాగే బీజేపీకి ప్రచారం కల్పిస్తూ ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై విషాన్ని కక్కింది. అయితే, ఇదే విధంగా స్పందించిన బీజేపీ మిత్రపక్షం విషయంలో మాత్రం బీజేపీ, మోడీలు మౌనం వహించారు. మీడియా కూడా ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ముస్లింలలో వెనుకబాటుతనం
2006 సచార్‌ కమిటీ నివేదిక ముస్లిం భారతీయులలో బహుళస్థాయి వెనుకబాటుతనాన్ని లేవనెత్తింది. ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హిందువుల కంటే వెనుకబడి ఉన్నారనీ, సామాజికంగా అణగదొక్కబడ్డారనీ, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, చారిత్రకంగా భూమి యాజమాన్యంలో అసమానతలు వంటి కారణాలతో వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారన్న నివేదిక సమాచారాన్ని మేధావులు గుర్తు చేశారు. వీరి బాగు కోసం కీలక హామీలను చేస్తే.. బీజేపీ వంటి హిందూత్వ పార్టీలు, సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనీ, దీంతో ముస్లింల జీవితాలు ఇప్పటికీ బాగుపడటం లేదని అంటున్నారు.

Spread the love