భారీ వర్షం..

– పొంగుతున్న వాగులు
– ఉమ్మడి వరంగల్‌లో స్తంభించిన రాకపోకలు
– పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి
– జలపాతాల సందర్శనకు అనుమతి రద్దు
– బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌తో భారీగా నష్టం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/మహాదేవ్‌పూర్‌
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు ధ్వంసమై రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. దాంతో వాతావరణ శాఖ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వరంగల్‌ జిల్లాలో సగటున 18.6 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మహబూబాబద్‌ జిల్లాలో 10.3, ములుగు జిల్లాలో 3.8 శాతం సగటు వర్షపాతం నమోదైంది.
వరంగల్‌ జిల్లా వట్టివాగు ఉధృతితో నెక్కొండ మండలకేంద్రం నుంచి గూడూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. పంటలు, చేలు నీట మునిగాయి. రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. చెన్నారాపుపేట మండలంలో నర్సంపేట, పాతముగ్దుంపురం రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదతో గోపనపల్లి, అనంతారం మధ్య రాకపోకలు బందయ్యాయి. కల్లెడ, అన్నారం షరీఫ్‌ గ్రామాల మద్య ఆకేరువాగు ఉధృతితో రావూరు, కల్లెడ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో పంథిని వద్ద వరంగల్‌-ఖమ్మం రహదారిపై రాకపోకలు, వరదతాకిడికి ఐనవోలు మండల కేంద్రం నుంచి గర్మిల్లపల్లి గ్రామానికి మధ్య రహదారులు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో భీమునిపాదం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సందర్శకులకు అనుమతి నిరాకరించారు. ధర్మసాగర్‌ మండలం ధర్మపురంలో పిడుగుపడి 25 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.
మత్తడిపోస్తున్న చెరువులు
ములుగు జిల్లా రామప్ప చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం 38 అడుగులు కాగా ప్రస్తుతం వరద ఉధృతితో 29.1 అడుగులకు చేరింది. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 71.87 అడుగులకు చేరింది. లక్నవరం చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా ప్రస్తుతం 28.1 అడుగులకు చేరింది. వరంగల్‌ జిల్లా వర్దన్నపేట మండలం మాదన్నపేట చెరువుకు వరద చేరడంతో మత్తడి పోస్తున్నది. పర్వతగిరి మండలం గోపనపల్లి ఊరచెరువుకు వరద తాకిడితో మత్తడి పడింది.
ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదల
భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 5,64,570 క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో 75 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కన్నాయిగూడెం మండలం సమ్మక్క బ్యారేజీలోకి ఇన్‌ప్లో 7,89,940 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా 59 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలారు. వరంగల్‌ జిల్లాలోని ఖానాపురం మండలం పాకాల సరస్సులోకి నీటి మట్టం 21 అడుగులకు చేరింది.
బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌తో భారీగా నష్టం
కొంత ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో రైతుల్లో వెల్లువెరిసిన ఆనందం కొన్ని రోజుల్లోనే ఆందోళనగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీనికి అనుసంధానంగా జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలూ నిండి బ్యాక్‌ వాటర్‌ పంట పొలాల్లోకి చేరుతోంది. దాంతో నదికి రెండు వైపులా రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తూ వందల ఎకరాల పంటలను ముంచుతోంది. బ్యాక్‌ వాటర్‌ కారణంగా వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చితోపాటు ఇతర పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఇలా పంట నీట మునిగినప్పుడల్లా అధికారులు సర్వే జరిపి, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేధిక పంపుతున్నారే శాశ్వత పరిష్కారం చూపడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజీ కింద అన్నారం చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి పూసుకుపల్లి, కుంట్లం, బలిజాపూర్‌, కన్నెపల్లి, మెటపల్లి, పలుగుల గ్రామాలకు సంబంధించిన సుమారు 350 ఎకరాలు మునుగుతున్నాయని ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పరిధి మహాదేవపూర్‌, బొమ్మాపూర్‌, సూరారం, బెగ్లూర్‌, బ్రాహ్మణపల్లి, అంబట్‌పల్లి, కుదురుపల్లి, ఎడపల్లి గ్రామాలకు సంబంధించిన సుమారు 340 ఎకరాల పంటలు తరచూ నీట మునుగుతున్నాయని మండల రైతు సంఘం నాయకులు వామన్‌రావు తెలిపారు. 2019 నుంచి ఇదే తంతు జరుగుతున్నా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
పలు జిల్లాల్లో వర్షాలతో నష్టం
వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్‌ మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 24 అడుగులు కాగా 23 అడుగుల మేర వరద నీరు చేరింది. భుగ్గ వాగు, నర్సాపూర్‌ వాగు, ఎన్నారం వాగు, జిన్నారం నాలుగు వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతోంది. రోడ్డు పైకి నుంచి నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి గ్రామానికి చెందిన క్యాతం యాదయ్యయాదవ్‌.. తన పొంలం వద్ద మందపెట్టిన 200 గొర్రెల్లో 26 మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.రెండు లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం తీర్ధాల వద్ద ఆకేరు వాగు బ్రిడ్జి పై నుంచి వరద పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓ రైతు తమ పశువుల తోలుకుని వంతెన దాటుతుండగా ఒక ఆవు నీటిలో కొట్టుకుపోయింది. ఖమ్మం నగరంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాత బస్టాండ్‌ సెంటర్‌లో మోకాళ్లలోతు నీరు నిలువడంతో వాహనదారులు, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతున్నాయి. కూసుమంచి మండలం నరసింహులగూడెం – కిష్టారం గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22 అడుగులకు నీరు చేరింది. వైరా రిజర్వాయర్‌ 18.3 అడుగులకు గాను 17.3 అడుగులకు నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 38.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. రాత్రికి మూడు నుంచి నాలుగు అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Spread the love