శతజయంతికైనా కాళోజీ పనులు పూర్తయ్యేనా..?

– ఎనిమిదేండ్లుగా నత్తనడక
– రూ.70కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
– సెప్టెంబర్‌ 9 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని చెప్పిన సీఎం.. ఎనిమిదేండ్లయినా పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరిట హన్మకొండలో నిర్మిస్తున్న కాళోజీ నారాయణరావు కళా వేదిక నిర్మాణం పనుల్లో తాజాగా వేగం పెరిగింది. సెప్టెంబర్‌ 9వ తేదీన ప్రజా కవి కాళోజీ నారాయణరావు శతజయంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపు పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. ఎనిమిదేండ్లుగా కాని పనులు నెలలోపులోనే మిగతా పనులు ఎలా పూర్తవుతాయన్నది ప్రశ్న. 2014లో సీఎం కేసీఆర్‌ రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ కళా వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 2016లో పనులు ప్రారంభించారు. రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని ఆనాడు సీఎం ప్రకటించారు. తొలుత ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా.. అనంతరం 2018లో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. అయినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే ప్రధాన కారణం. తొలుత తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ)కు కళా వేదిక పనులు అప్పగించగా.. నిధులు లేక చేతులెత్తేయడంతో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) నుంచి రూ.10 కోట్లు కేటాయించారు. ఇప్పుడు కుడాకే నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. కాగా, నిధుల లేమితో పనులు ఆలస్యం అవ్వడంతో ప్రస్తుతం అంచనా వ్యయం రూ.70కోట్లకు పెరిగింది.
ఇటీవల జరిగిన వర్షాకాల శాసనసభ సమావేశాల ముగింపు రోజు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించి కాళోజీ కళావేదికను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్‌ 9వ తేదీన ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా శతజయంతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అదేరోజూ కళా వేదికను ప్రారంభించాలన్న కేటీఆర్‌ ఆదేశంతో జిల్లా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది. ప్రజాకవి కాళోజీ పేరును తెలంగాణ ఉద్యమంలో వినియోగించుకున్న సీఎం కేసీఆర్‌ తన మాటను నేటికీ నిలబెట్టుకోకపోవడంతో కళాకారులు, కవులు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో 4.5 ఎకరాల్లో రూ.50 కోట్లతో 2016 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 4 అంతస్తుల్లో 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో ఆర్ట్‌ గ్యాలరీ, లైబ్రరీ, మ్యారేజీ హాలు, లెక్చర్‌ హాలు, గ్రీన్‌ రూమ్‌, రిహార్సల్స్‌ రూమ్‌తో పాటు 1100 మంది సీటింగ్‌ కెపాసిటీతో ఆడిటోరియం నిర్మాణానికి డిజైన్‌ చేశారు.
రూ.70 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
2014లో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా, నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడంతో తాజాగా దీని అంచనా వ్యయం రూ.70 కోట్లకు పెరిగింది. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో తొలుత శ్రీకో ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పనులు చేపట్టగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. అనంతరం కాంట్రాక్టర్‌ చేసిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధాంతరంగా పనుల నుంచి తప్పుకోవడంతో పనులు నిలిచిపోయాయి.
కరోనాతో మరో రెండేండ్లు ఆగిపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. కరోనా తర్వాత బృందావన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఈ పనులు చేపట్టింది. ఈ దశలో ‘కుడా’ నుంచి రూ.10 కోట్లు కళావేదిక పనులకు బదిలీ చేయడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను కూడాకే ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ‘కుడా’ కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ధైర్యం చేయలేక వెనక్కు తగ్గినట్టు సమాచారం. తాజాగా కాళోజీ శతజయంతి నిర్వహించనుండటంతో కళావేదిక ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయకపోతే ఎన్నికల ముందు విమర్శలకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం వడివడిగా పనులు చేపట్టినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love