ఈక్వెడార్‌లో పోటీలోవున్న అధ్యక్ష అభ్యర్థి హత్య

ఈక్వెడార్‌లో అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటిచేస్తున్న 59 ఏండ్ల ఫెర్నాండో విల్లావిసెంన్షియో బుధవారంనాడు క్విటోలో ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ‘వ్యవస్థీకృత నేరగాళ్ళు’ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈక్వెడార్‌ రాజధానిలో జరిగిన ర్యాలీ నుంచి తన ప్రచార సలహాదారైన కార్లోస్‌తో కలిసి బయటకు రాగానే ఫెర్నాండో విల్లావిసెంన్షియోపైన కాల్పులు జరిగాయి. అతని తలపైన మూడు బుల్లెట్లు దిగటంతో ఆయన మరణించినట్టు ధ్రువీకరించారు. ఇది వ్యవస్థీకృత నేరగాళ్ళపనేనని, ఈ హత్యను పరిష్కరిస్తామని అధ్యక్షుడు గ్విల్లర్మో లాస్సో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు. అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశామనీ, అయితే అతను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని ఈక్వడార్‌ అటార్ని జనరల్‌ తెలిపాడు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీస్‌ అధికారులతోసహా మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. దీనిని టెర్రరిస్టు చర్యగా పోలీసులు అభివర్ణించారు. ఈక్వెడార్‌ అధ్యక్ష ఎన్నికలు పది రోజులుండగా ఫెర్నాండో విల్లావిసెంన్షియో హత్య జరిగింది. ఇతనితోపాటు మరో ఏడుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
చనిపోయేనాటికి ఫెర్నాండో విల్లావిసెంన్షియో 7.5శాతం ప్రజల మద్దతుతో ఐదవ స్థానంలో ఉన్నట్టు స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది. ఈ హత్య జరిగిన తరువాత మిగిలిన అభ్యర్థులందరూ తమ తమ ప్రచార కార్యక్రమాలను నిలిపివేశారు.

Spread the love