నవతెలంగాణ న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఒక పోస్టర్ ఫొటోను విడుదల చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించినట్టు ఆరోపించిన రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. అయితే వారి నిరసనను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మహిళా మంత్రులు స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఒకరు కనిపించడం లేదని, మహిళా రెజ్లర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరొకరు పారిపోతున్నారంటూ ట్విట్టర్‌లో విమర్శించింది.
కాగా, తాను కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తాను ఇప్పుడే అమేథీలోని సిరిసిరా గ్రామం నుంచి ధరన్‌పూర్ వైపు బయలుదేరినట్టు తెలిపారు. అలాగే మోడీ ఇంటి పేరు కేసులో దోషిగా తేలి లోక్‌సభకు అనర్హుడైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆమె ఎగతాళి చేశారు. ‘మాజీ ఎంపీ కోసం వెతుకుతున్నట్లయితే దయచేసి అమెరికాను సంప్రదించండి’ అని హిందీలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో స్మృతి ఇరానీ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.