టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహణను యూపీఎస్సీకి అప్పగించాలి

– ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగాల్లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముఖ్యమైందనీ, కానీ దాని పనితీరు మాత్రం లోపభూయిష్టంగా ఉందని ఏఐవైఎఫ్‌ విమర్శించింది. పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమై, ప్రశ్న పత్రాల లీకేజీలకు టీఎస్‌పీఎస్సీ కేంద్ర బిందువుగా మారిందని తెలిపింది. ఒక వైపు ప్రశ్నపత్రాల లీకేజీలకు సంబంధించిన నింధితుల విచారణ, దర్యాప్తు పూర్తిగా జరగకుండానే, కమిషన్‌లో ఉన్న లీకేజీ దోషులను తొలగించకుండానే, ఆ బోర్డు ఆధ్వర్యంలో మళ్లీ పరీక్షలను నిర్వహించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ఆదివారం రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహణ బాధ్యతలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీకి) అప్పగించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్రలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం(సత్య నారాయణరెడ్డి భవన్‌)లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నా వాటిని పకడ్బందీగా నిర్వహించలేకపోయిన టీఎస్‌పీఎస్సీ బోర్డ్‌ను ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Spread the love