నేడు గ్రూప్‌-1 పరీక్ష

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించే రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
2.75 లక్షల మంది డౌన్‌లోడ్‌…
గ్రూప్‌-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో పరీక్షను రద్దు చేసిన కమిషన్‌ ఆదివారం తిరిగి నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు 2.75 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నాపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్‌ వర్గాలు సూచించాయి.

Spread the love