ప్చ్‌..చేజేతులా..!

– భారత్‌-బంగ్లాదేశ్‌ మహిళల మూడో వన్డే టై
– వన్డే సిరీస్‌ 1-1తో సమం
ఢాకా: బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన మూడో, చివరి వన్డే టై అయ్యింది. బంగ్లాదేశ్‌ మహిళలజట్టు నిర్దేశించిన 226పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు 225పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో భాగంగా భారత్‌ 6వికెట్ల నష్టానికి 212పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. మరో 14పరుగులు చేస్తే సిరీస్‌ మనదే అనుకున్న దశలో 5పరుగుల వ్యత్యాసంలో మూడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. ఆ దశలో చివరి వికెట్‌కు రోడ్రిగ్స్‌-మేఘ్న సింగ్‌ కలిసి లక్ష్యానికి చేరువ చేశారు. మ్యాచ్‌ ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుండగా.. 48.5వ బంతిని మేఘ్న ఫోర్‌ కొట్టి గెలుపుపై ఆశలు కల్పించింది. చివరి 3బంతుల్లో మరో పరుగు చేస్తే గెలుపు మనదే అనుకున్నకుంటుండగా.. బంగ్లా బౌలర్‌ మరుఫా అక్తర్‌ వేసిన బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ నిగర్‌ సుల్తానాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యింది. దీంతో మ్యాచ్‌ టై కాగా.. బంగ్లా అమ్మాయిలు సంబరాల్లో మునిగారు. ఈ మ్యాచ్‌లో పసికూన బంగ్లాదేశ్‌ అమ్మాయిల పోరాట పటిమ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌ గెలుపొందడంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఢాకాలో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ మహిళలజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఫర్గానా హక్‌, షమీమా బ్యాటింగ్‌లో రాణించారు. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ ఫర్గానా హక్‌(160 బంతుల్లో 7 ఫోర్లు 107) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్‌ షమీమా సుల్తానా(78 బంతుల్లో 5 ఫోర్లతో 52) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో స్నేV్‌ా రాణా రెండు వికెట్లు తీయగా.. దేవికా వైద్యకు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్‌ 49.3 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధానా(85 బంతుల్లో 5 ఫోర్లతో 59), హర్లీన్‌ డియోల్‌(108 బంతుల్లో 9 ఫోర్లతో 77) అర్ధ సెంచరీలతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్‌(45బంతుల్లో 33నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. చివర్లో టెయిలెండర్లు సాయంతో గెలుపు తీరాలకు చేర్చినా ప్రయోజనం లేకపోయింది. బంగ్లా బౌలర్లో నహిదా అక్తర్‌(3/37) మూడు వికెట్లు తీయగా.. మరుషా అక్తర్‌ రెండు వికెట్లు పడగొట్టారు. సుల్తానా ఖాటున్‌, రాబెయ ఖాన్‌, ఫహిమా ఖాటున్‌ తలో వికెట్‌ తీసారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్లిన్‌ డియెల్‌కు, సిరీస్‌ ఫర్గానా హక్‌కు లభించాయి.

Spread the love