– టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌కు పలువురు అభ్యర్థుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2 రాతపరీక్షలను వాయిదా వేయాలని దాదాపు 500 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను శాంతియుతంగా విజ్ఞప్తి చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డిని సోమవారం పలువురు అభ్యర్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చేనెల 29,30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. అదేనెల ఒకటి నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలున్నాయని అభ్యర్థులు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు జేఎల్ పరీక్షలున్నాయని వివరించారు. ఈ రెండు పరీక్షల వల్ల గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు పరీక్షకు మధ్య కాలవ్యవధి ఉండేలా చర్యలు తీసుకుంటామనీ, అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దాంతోపాటు గ్రూప్-2 సిలబస్ మారిందని వివరించారు. కొత్త సిలబస్‌లో ఎకానమిలో 70 శాతం, పాలిటీ, సోషియాలజీ సబ్జెక్టుల సిలబస్ మారిందని తెలిపారు. వాటికి సంబందించిన ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేని కారణంగా సబ్జెక్ట్ నిపుణులకూ కొత్త సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాల తయారీకి సమయం పట్టిందని పేర్కొన్నారు. ఇటీవలే ఆ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రెండు, మూడు నెలలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని చదవలేకపోయామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్-2 రాతపరీక్షలకు సంబంధించి నాలుగు పేపర్లకు సిలబస్ అత్యధికంగా ఉన్నందున వాయిదా వేయాలని కోరారు. సన్నద్ధమయ్యేందుకు రెండు, మూడు నెలల సమయం ఇవ్వాలని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పాలకమ ండలిలో ఈ అంశాన్ని చర్చిస్తామని జనార్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఇతర పరీక్షలకు ఇబ్బందుల్లేకుండా అనుకూలంగా ఉంటే వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రూప్-2 అభ్యర్థులు క్రాంతి, నాగరాజు, సరిత, ఎంఎస్ స్వామి, మిత్రా, సరితా, వెంకట్, భాస్కర్ , లావణ్య తదితరులు పాల్గొన్నారు.