నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మంగళవారం సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఏఈఈ పేపర్‌ను మురళీధర్ నుంచి కొనుగోలు చేసిన క్రాంతి, శశిధర్‌తోపాటు డీఏఓ పేపర్‌ను సాయి లౌకిక్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన రవితేజను సిట్ అధికారులు అరెస్టు చేశారు. గత వారం నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడైన ప్రవీణ్ నుంచి ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను ఖరీదు చేసిన ఇద్దరు దళారుల ద్వారా నలుగురు ప్రశ్నాపత్రాన్ని కొన్నారు. దళారులుగా వ్యవహరించిన వరంగల్‌కు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డిని సోమవారం సిట్ అరెస్టు చేసింది. ఈ ఇద్దరు ఆ ప్రశ్నాపత్రాలను ఏడుగురికి అమ్మినట్టు వెల్లడించారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకొని, అందులో అడ్వాన్స్‌గా లక్ష రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకు తీసుకున్నట్టు విచారణలో తేలింది. దాంతో దళారుల నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు మరింత లోతుగా విచారించారు. తాజాగా క్రాంతి, రవితేజా, శశిధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మందిని సిట్ అధికారులు అరెస్టు చేసే అవకాశముంది.