– 4 వరకు అభ్యంతరాల స్వీకరణ
– వచ్చేనెల 27 వరకు వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ పత్రాలు :టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-4 రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక ‘కీ’పై బుధవారం నుంచి వచ్చేనెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వచ్చేనెల 27 వరకు అవి అందుబాటులో ఉంటాయని వివరించారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష గతనెల ఒకటిన నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-1కు 7,62,872 (80 శాతం) మంది, పేపర్-2కు 7,61,198 (80 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.