నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ

– దరఖాస్తుల స్వీకరణకు విస్తృత ప్రచారం నిర్వహించాలి
– కారుణ్య నియామకాలను చేపట్టాలి: కలెక్టర్లకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నోటరీ స్థలాల క్రమబద్దీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన మేరకు జీఓనెంబర్‌ 84ను విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన విచారించి క్రమబద్ధీకరణ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆమె ఆదేశించారు. జీఓ నెంబర్‌ 59 కింద ఇప్పటికీ నోటీసులు అందుకున్న వారి నుంచి రెగ్యులరైజేషన్‌కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చేనెల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిని సీఎస్‌ సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు, తెలంగాణకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, గొర్రెల పంపిణీ, బీసీ, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పెన్షన్లు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో ఆమె సమీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఇటీవల చేపట్టిన కోటి మొక్కల నాటే కార్యక్రమంలో లక్ష్యానికి మించి మొక్కలను నాటామని తెలిపారు.

Spread the love