అంబేద్కర్‌.. విశ్వ మానవుడు ఇది విగ్రహం కాదు..విప్లవం

– తెలంగాణ కలలను సాకారం చేసే చైతన్య దీపిక : తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌సాగర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విశ్వమానవుని విశ్వరూపాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌సాగర్‌ తెలిపారు. నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టడంతో పాటు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినందుకు కతజ్ఞతగా ఇందిరాపార్కు వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత పేరును సచివాలయానికి పెడితే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఎందుకు సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టలేదో సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. పార్లమెంట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా సంక్షేమ పథకాలను రూపొందించినట్టు వివరించారు. ఒకప్పుడు కూలీలుగా ఉన్న దళితులు నేడు దళిత బంధు పుణ్యమా అని వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని యాజమానులుగా మారారని చెప్పారు. గత ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులపై నిర్లక్ష్య ధోరణి అవలంభించడం వల్లే నేటికీ వారి బతుకులు మారలేదన్నారు. దళితుల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో గానో కషి చేస్తున్నట్టు తెలిపారు.

Spread the love