ఫూలే, అంబేద్కర్‌ గొప్ప విప్లవకారులు

– దేశ ఆర్ధిక వ్యవస్థకు అంబేద్కర్‌ దిక్సూచి
– ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి
– ఎస్వీకేలో ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు, షార్ట్‌ ఫిలిం ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తుపాకీ గొట్టం ద్వారానే పోరాడే వాళ్లే కాదు జనంలో ఉంటూ సమాజ మార్పు కోసం కృషి చేసేవాళ్లూ విప్లవకారులేనని టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మెన్‌, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను, కుల వ్యవస్థ, మనువాద కోరల్ని కూకటివేళ్లతో సహా పీకి వేసేందుకు తమ వంతు కృషి చేసిన ఫూలే, అంబేద్కర్‌ గొప్ప విప్లవకారులు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, ఎస్వీకే ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిలను పురస్కరించుకుని సామాజిక సాంస్కృతికోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను బాగా ప్రభావితం చేసింది ఫూలే, కారల్‌ మార్క్స్‌ అనీ, అంబేద్కర్‌ ప్రతి ఆలోచనలోనూ, రచనలోనూ మార్క్సిస్టు భావజాలం కనిపిస్తుందని చెప్పారు. ఐదేండ్లు అధికారంలో ఉండి పదవి కోల్పోతేనే ప్రజలు గుర్తించని ఈ కాలంలోనూ వందల ఏండ్లు అయినా మార్క్స్‌, అంబేద్కర్‌ జనం నోళ్లలో నానటం గొప్ప విషయం అన్నారు. వారిద్దరి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం నేటి యువతపై ఉందని నొక్కి చెప్పారు. లండన్‌ మ్యూజియంలో అంబేద్కర్‌, కారల్‌ మార్క్స్‌ విగ్రహాలు పక్కపక్కనే ఉండటం గమనార్హమన్నారు. విగ్రహాలు అలంకారప్రాయం కాదనీ, మహనీయులను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని కొనసాగించేందుకు దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అంబేద్కర్‌ దిక్సూచి అనీ, ఇండియా ఆర్థిక నిర్మాణంపై పరిశోధనాపత్రం అందజేశారని గుర్తుచేశారు. అందుకే ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అంబేద్కర్‌ బొమ్మ ఉంటుందని తెలిపారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఏడున్నరేండ్ల కోర్సును రేయింబవళ్లు కష్టపడి రెండేండ్లలో పూర్తిచేసిన గొప్ప జ్ఞాని అంబేద్కర్‌ అని కొనియాడారు. తమ వర్సిటీలో చదివి ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా అంబేద్కర్‌ను కొలంబియా విశ్వవిద్యాలయం గుర్తించిందన్నారు. కొలంబియా వర్సిటీ ఏర్పడి 250 ఏండ్లు అయిన సందర్భంగా 2004లో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. బ్రిటన్‌లో అందరికీ హక్కు లేనిరోజుల్లోనే భారతీయులందరికీ సార్వత్రిక ఓటు హక్కు కావాలనే డిమాండ్‌ను బ్రిటీష్‌ పాలకుల ముందు పెట్టి దాని ఆవశ్యకతను వారికి వివరించిన మహనీయుడన్నారు. సైమన్‌ కమిషన్‌ను స్వాగతించి భవిష్యత్‌లో గొప్ప ఆధునిక రాజ్యంగా భారత్‌ రూపుదిద్దుకోవాలంటే పరిపాలనా వ్యవస్థ, చట్టసభల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఎలా ఉండాలనే ప్రతిపాదనను దాని ముందు పెట్టారని గుర్తుచేశారు. రాజ్యాంగ కమిటీలోని సభ్యులు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకూ ఓపికగా సమాధానం ఇస్తూ భవిష్యత్‌ భారతానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. అంబేద్కర్‌ రచనలను నిషేధించినవాళ్లు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అంగీకరించని మనువాదులు నేడు రాజకీయాల కోసం ఆయన జనం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ చేసిన సేవలకు తగిన గుర్తింపు రాకపోవడానికి మనువాదమే కారణమని నొక్కి చెప్పారు. అంబేద్కర్‌ కోరుకున్న ప్రజాస్వామ్య, లౌకిక, సార్వభౌమాధికార విలువలపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులను మనుషులుగా గౌరవించాలనీ, అందరికీ స్వేచ్ఛ కల్పించాలనే ఆయన ఆశయాలకు కేంద్రంలోని పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కుల రక్కసి పసిమెదళ్లను ఏవిధంగా గాయపరుస్తున్నదనే అంశంపై జాన్‌ శ్రీధర్‌ నిర్మించిన ‘చంద్రుడు’ అనే షార్ట్‌ఫిలిం ద్వారా చక్కగా చూపెట్టారు. చిన్నచిన్న లోపాలుంటేనే భయపడి అమ్మో అని వెనకడుగు వేసేవారికి యూట్యూబ్‌ స్టార్‌ భాగ్య తన ఒంటికాలితో చేసిన నృత్యప్రదర్శన అబ్బురపరించింది. ఔరా! ఏమి ప్రదర్శన..అనేలా కర్రసాము చేసి వీక్షకుల ప్రశంసలను చూరగొన్నది. ‘మనువాదానికి మరణ శాసనం రాస్తున్నాం…. దేశాన్ని ప్రేమించుమన్నా!….జయహో అంబేద్కర్‌..’ తదితర పాటలకు యువ కళాకారులు డ్యాన్స్‌లు చేశారు. గాయకులు తమ పాటలను ఆలపించారు.

Spread the love