– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి అన్నారు. ఆదివారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అడపా సంతోష్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా ఆర్‌ఎల్ మూర్తి హాజరై ‘ప్రస్తుత రాజకీయం విద్యారంగంపై ప్రభావాలు’ అంశంపై మాట్లాడారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలు చేస్తూ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి కల్పించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. పేపర్ లీకేజీలతో నష్ట పోయిన నిరుద్యోగులకు నష్ట పరిహారం ఇవ్వకుండా, విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా, గురుకుల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకు రాకుండా విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పెండింగ్ మెస్, కాస్మొటిక్, మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల చేయాలని కోరారు. సెలవుల్లో ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నడపకూడదని చెబుతూనే.. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సమ్మర్ క్లాస్‌లు ఎట్లా బోధిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దమెర కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రాజు, బోడ్డు స్మరన్, బోడ్డు కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, రిత్వక్, విష్ణు, అంజి, సాగర్, శేఖర్, విజరు తదితరులు పాల్గొన్నారు.