ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చిన విద్యుత్‌ రంగం

– ఐ అండ్‌ పీఆర్‌ విశ్లేషణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికత, పాలనా దక్షతకు నిదర్శనంగా రాష్ట్రంలో విద్యుత్‌రంగం వెలుగులు విరజిమ్ముతున్నదని సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్లేషించింది. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఊతంగా నిలుస్తుందన్నారు. రూ.97,321 కోట్లతో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్ట పరిచినట్టు తెలిపారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ లోటు వుండేదన్నారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ల నిర్మాణం జరిగిందనీ, తలసరి విద్యుత్‌ వినియోగం 1,196 కిలోవాట్‌లుగా ఉందని వివరించారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్మాణం చేపట్టలేదనీ, అరకొర కరెంటుతో నిత్యం వ్యవసాయ మోటార్లు , ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవనీ, ఎండిన పంటలతో రైతులు రోడ్డెక్కేవాళ్లని తెలిపారు. విద్యుత్‌ కోతలతో వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయని విశ్లేషించారు. పవర్‌ హాలిడేస్‌తో పరిశ్రమలు మూతపడ్డాయనీ, మనుగడ కోసం రైతులు, శ్రామికులు వలసబాట పట్టారని తెలిపారు. కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికత, పాలనా దక్షతతో తొమ్మిదేండ్ల స్వల్పకాలంలో విద్యుత్‌ రంగం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను విస్తరించి, పటిష్ట పరిచేందుకు రూ.97,321 కోట్లను తొమ్మిదేండ్లలో ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకి పెంచినట్టు తెలిపారు.

Spread the love