పోలవరం బ్యాక్‌వాటర్స్‌ ప్రభావంపైన అధ్యయనం చేయాలి

– పీపీఏకు ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పోలవరంపై బ్యాక్‌వాటర్స్‌ ప్రభావంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు ప్రత్యేకంగా లేఖ రాశారు. సర్వే చేయడానికి గతంలో ఒప్పుకున్న ఏపీ సర్కారు, ఇప్పుడు జాప్యం చేయడం సరికాదన్నారు.2016 నుంచి లేఖలు రాస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. అధ్యయనం చేయడంలో ఆలస్యం మూలంగా నష్టం జరుగుతుందని గుర్తుచేశారు. బ్యాక్‌వాటర్స్‌ మూలంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. గత ఏడాది కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చినా దృష్టిపెట్టడం లేదని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రంలోపాటు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాయయని చెప్పారు. ఆమేరకే కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. సారపాక ఐటీసీ, మణుగూరు హెచ్‌డబ్ల్యూపీ, భద్రాచలం పట్టణానికి ముప్పు ఉందన్నారు. 28 వేల ఎకరాలు మునిగిపోయే ప్రమాదముందని ఎప్పటికప్పుడు చెబుతున్నామని వివరించారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో సమస్య లు తలెత్తె అవకాశం ఉందనీ, అలాగే గోదావరిలో వరద బాగా వస్తున్నద ని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అధ్యయనం చేయాలని కోరారు. గతంలో సంయుక్త సర్వే చేయాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నా రు. ఇకపోతే సమాచారం అడిగినా ఇవ్వడం లేదని సీడబ్ల్యూసీకి గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే.ముందుగా చెప్పినా సంయుక్త సర్వే చేయలేదనీ,వర్షాకాలం ప్రారంభమైతే సర్వే చేయడానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయని ముందే చెప్పామని అన్నారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను ఈఎన్సీ సి.మురళీధర్‌ సోమవారం పీపీఏకు రాశారు.

Spread the love