బీఆర్‌ఎస్‌కు హైకోర్టు నోటీసు

–  కోకాపేట భూమి కేటాయింపుపై
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని 11 ఎకరాలను బీఆర్‌ఎస్‌కు కేటాయించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామారపు రాజేశ్వర్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. భూమి కేటాయింపు ఏకపక్షంగా జరిగిందనీ, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా తక్కువ ధరకు భూమి ఇచ్చిందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దాఖలు చేసిన పిల్‌ తరఫు లాయర్‌ వాదిస్తూ, భూమి కేటాయింపు జీవో బయటకు రాలేదన్నారు. ఎకరం ధర రూ.3.4 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించి అధికార పార్టీకి 11 ఎకరాలిచ్చిందన్నారు. ఆ భూమి మొత్తం విలువ 500 కోట్ల వరకు ఉంటుందన్నారు. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఆగస్టుకు వాయిదా వేసిన హైకోర్టు, ఈలోగా ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలంది. జీవోను ఎందుకు బయట పెట్టలేదని ప్రభుత్వాన్ని అడిగింది. ఈ వ్యవహారం ప్రభుత్వం వద్దనే ఉందనీ, ఊహాజనిత లెక్కలతో పిటిషనర్‌ వాదిస్తున్నారని ప్రభుత్వం జవాబు చెప్పింది. జీవో బయటకు రాలేదుగానీ, పార్టీ ఆఫీసు కట్టేందుకు భూమిపూజ కూడా జరిగిందని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు. విచారణ ఆగస్టు మూడో వారానికి వాయిదా పడింది.

పొంగులేటి కుటుంబం 30 గుంటల స్థలంపై సర్వే రిపోర్టు ఇవ్వండి
ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో మాజీ ఎంపీ పొంగులేటి కుటుంబానికి చెందిన 30 గుంటల స్థలాన్ని సర్వే చేయాలని అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు స్పందించింది. తదుపరి విచారణ నాటికి సర్వే రిపోర్టు అందజేయాలంది. ఆ స్థలం విషయంలో స్టేటస్‌కో (యథాతథస్థితి) అమలు చేయాలంది. ఈ మేరకు అధికారులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన 30 గుంటల స్థలాన్ని ప్రభుత్వం తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి హైకోర్టులో రిట్‌ వేశారు. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఇచ్చిన హైకోర్టు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలంది. విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.
ఏజెన్సీ ఏరియాల్లో అన్ని పదవులు స్థానిక గిరిజనులకే ఇవ్వాలి
హైకోర్టులో పిల్‌ దాఖలు
ఏజెన్సీ ఏరియాల్లో అన్ని పదవులు స్థానిక గిరిజనులకే చెందుతాయని పేర్కొంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. లంబాడి హక్కుల పోరాట సమితి నగర భేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా దేవనాయక్‌ వేసిన పిల్‌ను మంగళవారం యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ సావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్వర్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల డైరెక్టర్‌, చైర్మన్‌, నీటి సంఘాల పదవులన్నీ స్థానిక గిరిజనులకే ఇవ్వాలని గిరిజన సలహా మండలి సిఫార్సుల్ని అమలు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ వాదించారు. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టుకి వాయిదా వేసింది.

Spread the love