న్యాయమే గెలిచింది…

– హైకోర్టు తీర్పుపట్ల గెస్ట్‌ లెక్చరర్ల సంఘం హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యాయమే గెలిచిందనీ, హైకోర్టు తీర్పు అధికారుల మొండివైఖరికి చెంపపెట్టుఅని గెస్ట్‌ లెక్చరర్ల సంఘం విమర్శించింది. 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాలనీ, కొత్త వేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పదేండ్లుగా పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను కాదనీ, ప్రస్తుత విద్యాసంవత్సరంలో పీజీ మెరిట్‌ ఆధారంగా కొత్త వారిని ఎంపిక చేయాలంటూ ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గెస్ట్‌ లెక్చరర్లు న్యాయ పోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగిని తొలగించి మరో తాత్కాలిక ఉద్యోగిని నియమించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుందని పేర్కొన్నారు.
1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించాలంటూ కమిషనర్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించిందని వివరించారు. కొత్త నోటిఫికేషన్‌ వేసిన ఇంటర్‌ విద్యా కమిషనర్‌, అధికారులకు ఈ తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు.

Spread the love