నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాఠశాలల రికార్డుల్లో విద్యార్థుల కుల ప్రస్తావన చేయరాదన్న పిల్‌పై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడ్మిషన్ సమయంలో కుల ప్రస్తావన లేకుండా చేయాలనీ, విద్యార్థులకు ఇచ్చే టీసీల్లో (టాన్స్‌ఫర్ సర్టిఫికెట్)ల్లో విద్యార్థుల కుల ప్రస్తావన లేకుండా చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల రికార్డుల్లో కుల వివరాలు లేకుండా చేయాలని కోరుతూ బీహెచ్‌ఈఎల్ మాజీ మేనేజర్ నారాయణ హైకోర్టుకి లేఖ రాశారు. దీనిని పిల్‌గా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
విద్యార్థి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా కుల సమాచారాన్ని అడ్మిషన్లలో నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత టీసీలోనూ దాన్ని పేర్కొంటున్నారని తెలిపారు.