గెస్ట్‌ లెక్చరర్లు కొనసాగింపు

– హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయం
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లను 2023-24 విద్యాసంవత్సరంలో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన వారిని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడైతే ఖాళీ పోస్టులుంటాయో అక్కడ నిబంధనల ప్రకారం డీఐఈవోలు కొత్త వారిని గెస్ట్‌ లెక్చరర్లుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ ఉత్వర్వులను విడుదల చేయడం పట్ల గెస్ట్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ హర్షం ప్రకటించారు. టిప్స్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌ నేతృత్వంలో ఇంటర్‌ విద్యాశాఖ ఆర్జేడీ జయప్రదబాయిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డికి ధన్యవాదాలు ప్రకటించారు. గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించడం పట్ల టిప్స్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌, సమన్వయకర్త మైలారం జంగయ్య, కన్వీనర్‌ కొప్పిశెట్టి సురేష్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love