కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో 1,241 పోస్టుల భర్తీ

– నేడు నోటిఫికేషన్‌ విడుదల
– 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ
– జులైలో రాతపరీక్ష ద్వారా ఎంపిక
– పాఠశాల విద్యాశాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల (యూఆర్‌ఎస్‌)లో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీకి చెందిన 1,241 ఖాళీ పోస్టులను తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్‌వోలు 42, పీజీసీఆర్టీలు 849, సీఆర్టీలు 273, పీఈటీలు 77 కలిపి మొత్తం 1,241 ఖాళీలున్నాయని వివరించారు. జిల్లాల వారీగా జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. విద్యార్హతలు, రాతపరీక్ష విధానం, సిలబస్‌, అభ్యర్థుల ఎంపిక విధానం వంటి సమగ్ర నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 25న దరఖాస్తు, ఖాళీలు, ఇతర వివరాలు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు వచ్చేనెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలని కోరారు. జులైలో రాతపరీక్ష ద్వారా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. దాని ద్వారానే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

Spread the love