ముందుచూపు

ప్రభుత్వ ప్రాథమిక స్కూళల్లో ఒక్కరు లేదా ఇద్దరే ఉపాధ్యాయులున్న ఉదంతాలు అనేకం. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఏడు తరగతులకు కలిపి ఐదుగురే ఉంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులను ఆకర్షించడానికి వెంటనే టీచర్ల రిక్రూట్‌మెంటు చేయాల్సి ఉంది. స్కూల్స్‌ను శుభ్రం చేసేందుకు రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులను నియమించడం వల్ల అన్నిరకాలుగా ఉపయుక్తంగా ఉంటుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. అదేవిధంగా బడి పిల్లలకు మధ్యాహ్నభోజనం అందించడాన్ని వ్యయంగా చూడొద్దనేది సుప్రీంకోర్టు సూచన.
విద్య అనేది సమాజంలో అత్యంత ముఖ్యమైనభాగం. అలాంటి విద్య విషయంలో పాలకులకు సరైన కార్యాచరణ ఉందా? అంటే ఇప్పటికీ ఒకడుగు ముందుకు నాలుగడులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే విద్యాశాఖలో నెలకొన్న సమస్యలు యేటేటా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. రానున్న విద్యాసంవత్సరం కూడా పరిష్కారం చేయాల్సినవి చాలా ఉన్నాయి. మూసుకున్న పాఠశాలలు మరికొద్దిరోజుల్లో తెరచుకోనున్నాయి. ఈ వేసవి సెలవులలో ప్రభుత్వపాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కారం చేశారన్నదే ప్రశ్న. పాఠశాలలపై ఎక్కువ అవగాహన ఉండేది అధికారులకే. స్కూళ్లలో కేటాయించాల్సిన బల్లలు, కుర్చీలు, చాక్‌పీసులు, పుస్తకాలు, మంచినీరు, విద్యుత్‌, బాత్‌రూమ్స్‌ మరమ్మతు వంటి సమస్యలు ప్రతీ ఏడాది ఉంటాయి. వీటితోపాటు టీచర్లు లేకపోతే రెగ్యులర్‌ నియామకాలు జరిగే వరకు తాత్కాలిక పద్ధతినైనా టీచర్లను భర్తీ జరిగితేనే విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాలకు లోనుగాకుండా చదువులపై మనసు లగం చేయడానికి వీలుంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి నోట్‌ పుస్తకాలు కూడా అందిస్తామని, అవి కూడా ప్రారంభం రోజే అందజేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించి ఉన్నారు. యూనిఫామ్‌లతో పాటు బెల్టు, టై ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో ఏ పనిని ఎంతవరకు పూర్తి చేశారన్నది తెలియదు. లోటు పాట్లుంటే మిగిలిన వారం రోజుల సమయాన్ని సద్వినియో గం చేసుకుని కనీస సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలి.
‘ప్రతీ తల్లి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చితే విలువలతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకం కలిగే పరిస్థితులు నెలకొల్పినప్పుడే ప్రభుత్వ పాఠశాలల మనుగడకు సార్ధకత ఉంటుంది’ అని రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్‌కలామ్‌ చెప్పారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో నాణ్యమైన విద్యను అందిస్తామని మన పాలకులు వల్లె వేస్తుంటారు. అది మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 60లక్షల మంది విద్యార్థులుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు 30లక్షల మంది దాకా ఉంటారని అంచనా. స్కూల్స్‌లో అన్ని తరగతులకు టీచర్లుంటేనే విద్యార్థులు వస్తుంటారు. తల్లిదండ్రులకు ధైర్యం కలుగుతుంది. అయితే, గురుకులాల్లో టీచర్లను భర్తీ చేస్తున్న ప్రభుత్వం… జిల్లా, మండల ప్రజా పరిషత్‌ పాఠశాలల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టడం లేదు. దీని వెనుక కారణాలేంటన్నది ప్రశ్న! విద్యాసంవత్సరం ప్రారంభంలో మాత్రం ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వ ప్రకటనలు ఊరిస్తుంటాయి. ఆ తర్వాత ఏవేవో కారణాలతో ఆగిపోతుంటాయి. 2017లో టీఆర్‌టి ద్వారా సుమారు 8వేల 500పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 22వేల టీచర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. విద్యావాలంటీర్ల నియామకాలూ మధ్యలోనే జరుగుతున్నాయి.
”మన ఊరు మన బడి” ద్వారా రూ.7 వేల కోట్లతో స్కూళ్ళను బాగుచేయబోతున్నట్టు గత సంవత్సరం జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మూడోవంతు స్కూల్స్‌ కూడా బాగుపడలేదు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బాగుకు 12రకాల వసతులు కల్పిస్తామని అంటున్న ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆచరణకు పూనుకోవాలి. ఎన్ని చేసినా టీచర్లను నియమించకుంటే ఉపయోగం ఉండదని ప్రభుత్వం గుర్తించాలి.
ప్రభుత్వ ప్రాథమిక స్కూళల్లో ఒక్కరు లేదా ఇద్దరే ఉపాధ్యాయులున్న ఉదంతాలు అనేకం. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఏడు తరగతులకు కలిపి ఐదుగురే ఉంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులను ఆకర్షించడానికి వెంటనే టీచర్ల రిక్రూట్‌మెంటు చేయాల్సి ఉంది. స్కూల్స్‌ను శుభ్రం చేసేందుకు రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులను నియమించడం వల్ల అన్నిరకాలుగా ఉపయుక్తంగా ఉంటుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. అదేవిధంగా బడి పిల్లలకు మధ్యాహ్నభోజనం అందించడాన్ని వ్యయంగా చూడొద్దనేది సుప్రీంకోర్టు సూచన. కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించకుండా… రాష్ట్రాలపై భారం మోపడం వల్ల సకాలంలో వంటకార్మికులకు నిధులు అందడం లేదు. మంచి భోజనం పెట్టడంలేదని వారిపైనే మళ్లీ ఆరోపణలు. వివాదాలు ఎలా ఉన్నా పిల్లల ఆరోగ్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యంగా ఉండటం ఎంతమాత్రం సరికాదు. 90శాతం టారులెట్స్‌ సౌకర్యం కల్పించినా నీరు లేకపోవడం ప్రధాన సమస్య. ఈ విషయంలో బాలికల బాధ వర్ణనాతీతం. భరించలేక చివరికి చదువే మానేస్తున్న పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు కంప్యూటర్‌ విద్య ను ప్రవేశపెట్టినా చాలా స్కూళ్లలో విద్యుత్‌ సౌకర్యం లేదు. వాటన్న టినీ స్కూళ్లు తెరిచేనాటికి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Spread the love