వివాదాస్పదమవుతున్న ‘ఎన్సీఈఆర్టీ’ తీరు

రసాయనశాస్త్ర విద్యాభ్యాసానికి పునాది వంటి ఆవర్తన పట్టిక పాఠ్యాంశంను పదవ తరగతి సిలబస్‌ నుంచి తొలగించడం వల్ల ఎన్సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఈ మధ్యనే జీవ పరిణామ సిద్ధాంతంలో ముఖ్యమైన డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించడం వల్ల ఎన్సీఈఆర్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందించడంలో డార్విన్‌ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక పాఠ్యాంశాలు చాలా కీలకమైనవి. రాజ్యాంగంలోని 51ఏ(హెచ్‌) భారతదేశంలోని ప్రజల్లో మానవత్వం, శాస్త్రీయ వైఖరులు, ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని నిర్దేశించింది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. జూన్‌ 6, 1961లో స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేసిన ఎన్సీఈఆర్టీ రాజ్యాంగ మౌలిక లక్ష్యానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకురావడంలో, నూతన పరిశోధనలు ప్రోత్సహించడంలో విద్యారంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో సలహాలు, సూచనలివ్వడానికి ఏర్పాటు చేసిన సంస్థ.విద్యా వ్యవస్థలో నూతన ఒరవడులను రాబోయే తరాలకు అందించడం, ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనా రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం పాఠ్యప్రణాళిక రూప కల్పన ఆధునిక అవసరాలు అవసరాలకు అనుగుణంగా రూపొందిం చడం, ఉపాధ్యాయ శిక్షణలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసింది.
ఎన్సీఈఆర్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో అధ్యక్షులతోపాటు డైరెక్టర్లు ఉంటారు. అధ్యక్ష హోదాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి, డైరెక్టర్ల హోదాలో వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌, విద్యావేత్తలు ఉంటారు. రాజ్యాంగ మౌలిక లక్ష్య సాధన కోసం సదుద్దేశంతో ఏర్పాటు చేస్తే ఎన్సీఈఆర్టీ తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం పెత్తనానికి నిదర్శనంగా మారాయి. ఇది భారత సమాఖ్య స్పూర్తికి అత్యంత విరుద్ధం.అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పార్టీల భావజాలా లకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ నిర్ణయాలు తీసుకొని వాటిని రాష్ట్రాలపై, దేశ ప్రజలందరిపై బలవంతంగా రుద్దుతున్నారు. ఇలాంటి చర్యల్లో భాగమే ఈ మధ్యకాలంలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాలు డార్విన్‌ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక పాఠ్యాంశం తొలగింపు, ప్రజాస్వామ్యం పాఠ్యాంశం, రాజకీయ పార్టీల అంశం తొలగింపు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీఈఆర్టీ చెబుతున్నప్పటికీ రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఈ నిర్ణయాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో భావి భారత పౌరులకు ప్రజాస్వామ్య భావాలు, ప్రజా ఉద్యమాలు పోరాటాలు వంటి చైతన్య పూరిత పాఠ్యాంశాలను పాలకులు కావాలనే దూరం చేస్తున్నారు. గతంలో మొఘలుల చరిత్ర, నవాబులు, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌, గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌ నిషేధం తొలగించారు. విద్యార్థులపై భారం తగ్గించటం కాదు జాతీయ విద్యా విధానం2020, నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌ వర్క్‌2023 అమలులో భాగమే ఈ పాఠ్యాంశాల తొలగింపు అని చాలామంది విద్యా నిపుణులు చెబుతున్నారు. కేంద్ర పాలకుల భావజాలానికి అనుగుణంగా లేవనే తొలగిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఎన్సీఈఆర్టీ వ్యవహరిస్తున్న తీరుపై మేధావులు కవులు కళాకారులు శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య వాదులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఏ మౌలిక లక్ష్యాల సాధన కోసం 62 ఎండ్ల కింద ఏర్పాటు చేసిన ఎన్సీఈఆర్టీ ఆ లక్ష్య సాధనకు మాత్రమే కృషి చేయాలి కానీ రాజకీయ పార్టీల భావజాలాలకు అనుగుణంగా పని చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. పాఠ్యాంశాలను ఎత్తేసి భవిష్యత్తు భారతావని నిర్మాణంలో రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు విస్మరించే చర్యలు ఎంత మాత్రం సరికాదు. దీనికి ఎన్సీఈఆర్టీ, దాన్ని నడిపించే కమిటీ, కేంద్రమే బాధ్యత వహించాలి.
– పాకాల శంకర్‌ గౌడ్‌, 9848377734

 

Spread the love