కాంగ్రెస్-ఆమ్ ఆద్మీల మధ్య కలకలం రేపిన అల్కాలాంబ ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అల్కాలాంబ ప్రకటించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. I.N.D.I.A. కూటమి పరస్పర అవగాహనతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అంతలోనే ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు తాము అన్నిచోట్ల పోటీ చేస్తామని ప్రకటించడం గందరగోళానికి దారి తీసింది. అల్కాలాంబ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి I.N.D.I.A. కూటమి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అల్కాలాంబ తమ పార్టీ అధికార ప్రతినిధేనని, కానీ ఇలాంటి కీలకమైన అంశాలపై మాట్లాడే అధికార ప్రతినిధి మాత్రం కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపక్ బబారియా అన్నారు. ఈ రోజు సమావేశంలో ఢిల్లీలో పోటీపై ఎలాంటి చర్చ జరగలేదని, అల్కాలాంబ ప్రకటనను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అల్కాలాంబ ఇమ్మెచ్యూర్ స్పోక్స్ పర్సన్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అర్థం చేసుకోవాలన్నారు.

Spread the love