పశ్చిమ బెంగాల్‌.. పంచాయతీ ఎన్నికల ప్రహసనం!

55563-2

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) తన రాజకీయ ప్రత్యర్ధులపై, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించిన ప్రజలపై పదేపదే తీవ్ర స్థాయిలో హింసాకాండకు దిగింది, బెదిరింపులకు పాల్పడింది. పోలింగ్‌ ప్రక్రియలోని ప్రతి దశలోను (నామినేషన్లు దాఖలు చేయడం నుండి, ప్రచారం, జులై 8 పోలింగ్‌ రోజున, జులై 11 ఓట్ల లెక్కింపు రోజున) అభ్యర్ధులపై, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులపై దాడులు జరిగాయి. ఓటర్లను బెదిరించడం, వారిని పోలింగ్‌ బూత్‌లకు వెళ్ళి, ఓటు వేయనీయకుండా అడ్డుకోవడం, బ్యాలట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం, పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు దిగారు. ఓటింగ్‌ క్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు.
చివరగా, అనేక చోట్ల పోలింగ్‌ ఫలితాలు తమకు అనుకూలంగా రావడం లేదని గ్రహించడంతో, ఓట్ల లెక్కింపు క్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలకు దిగడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లను లెక్కింపు జరిగే ప్రాంతాల నుండి బయటకు వెళ్ళగొట్టడం, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాలను నాశనం చేయడం, ఫలితాలను తారుమారు చేయడం వంటి పనులకు దిగారు. సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలుపొందారని, వారికి ఎన్నికైనట్లు సర్టిఫికెట్లను ఇచ్చే సమయంలో తృణమూల్‌ గూండాలు వాటిని లాక్కుని, చించివేసినట్లు అనేక వార్తలు వచ్చాయి. అత్యంత దారుణమైన కేసుల్లో ఒకటి భానగర్‌లో జరిగింది. అక్కడ ఐఎస్‌ఎఫ్‌ అభ్యర్థి జెహనారా బీబీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ అక్కడ తృణమూల్‌ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ మోసానికి వ్యతిరేకంగా స్థానికులు తీవ్ర నిరసన వ్యకం చేశారు. దాంతో అర్థరాత్రి సమయంలో, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. మొత్తమ్మీద ఈ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 60మంది చనిపోయారు.
ఈ అన్ని అక్రమాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, పాలక పార్టీతో కుమ్మక్కవడం ఈ ఎన్నికల్లో మరో కలవరపరిచే అంశం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పాత్ర ఈ మొత్తం క్రమంలో అత్యంత అవమానకరంగా ఉంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో తణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిందని ప్రధాన స్రవంతిలోని మీడియా ప్రకటించింది. రాజకీయ నిర్ధారణల కోసం ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి ప్రయత్నించడంలో ఎలాంటి అర్థం లేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఒక ప్రహసనంగా మారింది. పంచాయతీ సంస్థలన్నింటినీ తన వశం చేసుకోవడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నంలో ప్రజాస్వామ్యం ఛిద్రమైంది. అయితే, ఈ ప్రజా స్వామ్య వ్యతిరేక దాడి… కొన్ని హృదయపూర్వకమైన దృశ్యాలను అడ్డుకోలేకపోయింది. 2018 పంచాయతీ ఎన్నికల సమయంలో మాదిరిగా కాకుండా, ఈ ఎన్నికల్లో మొదట నుండి టిఎంసి గూండాల దౌర్జన్యాలకు ప్రజా ప్రతిఘటన తీవ్రంగా ఉంది. సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన అభ్యర్థులు, మద్దతుదారులు ఈ బెదిరింపులకు, భౌతిక దాడులకు ఎదురొడ్డి నిలబడిన ఘటనలు వందలాదిగా ఉన్నాయి. పోలింగ్‌ రోజున, వేలాదిమంది ప్రజలు టిఎంసి గూండాలను ఎదిరించి, బారికేడ్లను ఛేదించుకుని, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు క్రమంలో ఫలితాలను తారుమారు చేయాలని పన్నాగాలు పన్నిన పాలక పార్టీకి ఈ అనుభవం కలవరం కలిగించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది వామపక్షాలు, కాంగ్రెస్‌ అన్న విషయం కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో వెల్లడైంది. దాంతో టిఎంసి భయోత్పాత ఎత్తుగడలకు ప్రధాన లక్ష్యాలుగా మారింది కూడా ఈ పార్టీలవారే. వీరితో పోలిస్తే బీజేపీ ఇటువంటి దాడులకు గురైంది తక్కువే. ఈ కారణంగానే, టిఎంసి, బీజేపీలు ఒకే వర్గ ప్రాతిపదికను పంచుకుంటాయి. గ్రామీణ సంపన్నుల్లో, వారి పరాన్నభుక్కుల్లో వాటికి మద్దతు ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో టిఎంసి ఆధిపత్యం గత దశాబ్ద కాలంగా అది ఏర్పాటు చేసుకున్న, నిర్వహించిన నెట్‌వర్క్‌ నుండే వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నయా సంపన్నులు ఈ పార్టీకి ప్రధాన మద్దతుగా ఉన్నారు. గ్రామీణ బెంగాల్‌లోని రాజకీయ ఆర్థికవ్యవస్థ అంతా అన్ని స్థాయిల్లోని టిఎంసి కార్యకర్తలు వసూలు చేసే రెంట్‌ (ముడుపులు)తో నిండిపోయి ఉంటుంది. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులను ‘కట్‌ మనీ’ (కమిషన్లు) ద్వారా స్వాహా చేస్తుంటారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులయ్యేందుకు ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసే కమిషన్లు ఇవి. టిఎంసి అభీష్టాన్ని అమలు చేసే నయా సంపన్నులు, వారి ఏజెంట్ల అవినీతి, శక్తి వంతమైన నెట్‌వర్క్‌ ఇది. ముడుపులకు, బలవంతపు వసూళ్ళకు పంచాయతీలను దౌర్జన్యంగా హస్తగతం చేసుకోవడం, వాటిపై ఆధిపత్యం కలిగి ఉండడం చాలా కీలకం. ఈ నెట్‌వర్క్‌ పరిధిలోనే, దోపిడీ సొమ్ము పంచు కోవడంపై ఘర్షణలు, విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో, తృణమూల్‌ పెంచి పోషించే ఈ ముఠాలు, రాజకీయ ప్రత్యర్ధులపై, అలాగే అసమానతలు, ప్రయోజనాలను కొల్లగొట్టడంపై ఎవరైనా అసమ్మతి గళాన్ని వినిపిస్తే వారి నుంచి ఈ పథకాల ప్రయోజనాలను లాగేసుకోవడం అనేది తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో ఒక ఆయుధంగా మారింది.
ఈ అవినీతి-క్రిమినల్‌ బంధాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) వామపక్ష శక్తులు పోరాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుండి గత రెండేళ్ళలో, టిఎంసి అవినీతి బంధాలకు పెరుగుతున్న వ్యతిరేకతలో వామపక్షాల పాత్ర ప్రధానంగా ఉంది. అందువల్లే పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలపైనే ఎక్కువగా హింసాత్మక దాడులు చోటుచేసుకున్నాయి. నిరంతరంగా జరుగుతున్న పోరాటాలు, విపరీతంగా జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సీపీఐ(ఎం) వామపక్షాలు, ఇతర లౌకిక మిత్రులు అందరూ కలిసి ప్రజా ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్ళడాన్ని కొనసాగిస్తారు. తృణమూల్‌ పాలనపై పోరుసల్పుతారు. అత్యంత అధ్వాన్న ప్రత్యామ్నాయమైన బీజేపీని కూడా వారు కృత నిశ్చయంతో వ్యతిరేకిస్తారు.
బీజేపీ విషపూరిత, ప్రజాస్వామ్య వ్యతిరేక దాడులను ఎదుర్కొనడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సమాయత్తమ వుతున్న వేళ… బెంగాల్‌లో టిఎంసి విషపూరితమైన ప్రజాస్వామ్య వ్యతిరేక దాడులు… ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడుతున్నట్టు పోజు పెట్టేందుకు బీజేపీకి అవకాశమిస్తున్నాయి. తద్వారా ప్రతిపక్షాల ఐక్యతకు తృణమూల్‌ తీవ్ర హాని కలిగిస్తున్నది. -‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం

Spread the love