బెంగాల్‌ పంచాయతీ హింసాత్మకం 11 మంది మృతి

– పలు చోట్ల బ్యాలెట్‌ బాక్సుల అపహరణ
– బ్యాలెట్‌ పత్రాలకు నిప్పు
– తృణమూల్‌, బీజేపీ పరస్పర ఆరోపణలు
– ఎస్‌ఈసీలో పారదర్శకత లోపించింది : సీపీఐ(ఎం) నేత మహమ్మద్‌ సలీం
కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శనివారం హింసాకాండ చెలరేగింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు కాగా బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌కు చెందిన ఒక్కొక్కరున్నా రు. ఆరు వందల కంపెనీల కేంద్ర దళాలను, 70 వేల మంది రాష్ట్ర పోలీసులను మోహరించినప్పటికీ పలు చోట్ల అధికార తృణమూల్‌, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయి పరస్పరం దాడులకు తెగబడా ్డరు. హింసాకాండ నేపథ్యంలో కొన్ని గ్రామాలలో పోలింగ్‌ నిలిపివేశారు. రాష్ట్రం లో శాంతిభద్రతలను కాపాడడంలో కేంద్ర బలగాలు విఫలమయ్యాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే కేంద్ర దళాలను సరిగా వినియోగించుకోలేదని, తృణమూల్‌ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత సువేంద్రు అధికారి ప్రత్యారోపణ చేశారు. రాష్ట్రంలోని 73,887 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కూచ్‌బీహార్‌ జిల్లాలోని దిన్‌హటాలో అల్లరి మూకలు బ్యాలెట్‌ బాక్సులను అపహరించారు. బరవిత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలకు నిప్పుపెట్టారు. బర్నాచినాలోని పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ స్థానికులు బ్యాలెట్‌ బాక్సుకు, బ్యాలెట్‌ పత్రాలకు నిప్పంటించారు. సింద్రానిలో కొందరు దుందడుగు బ్యాలెట్‌ బాక్సులో నీరు పోశారు. బీజేపీ, తృణమూల్‌ మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ నిలిచిపోయింది.
మాల్డా జిల్లా ఇంగ్లీష్‌ బజార్‌లోని రెండు పోలింగ్‌ కేంద్రాలపై అల్లరి మూకలు బాంబులు విసిరారు. అదనపు కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్‌ చేస్తూ పలు ప్రాంతాలలో ప్రదర్శనలు జరిగాయి. నందిగ్రామ్‌లో కేంద్ర బలగాలను నియమించాలని కోరుతూ మహిళా ఓటర్లు పోలీస్‌ అధికారిని ఘెరావ్‌ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. ‘ప్రజలు నా కాన్వారుని ఆపారు. తమను పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లకుండా గూండాలు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. హింసాకాండలో కొందరు చనిపోయారని చెప్పారు. తమ గోదును ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు’ అని ఆయన చెప్పారు.
సీపీఐ (ఎం) కార్యకర్త మృతి
బర్ధమాన్‌ జిల్లా ఆష్‌గ్రామ్‌ బ్లాక్‌లో తృణమూల్‌ గూండాలు జరిపిన దాడిలో సీపీఐ (ఎం) కార్యకర్త రజీబుల్‌ హక్‌ ప్రాణాలు కోల్పోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన హక్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. తెరిచి ఉన్న బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు రోడ్డుపై పడివున్న దృశ్యాలతో ఉన్న ఓ వీడియోను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం షేర్‌ చేశారు. ‘ఓటింగ్‌ అయిపోయింది. కానీ బ్యాలెట్‌ పత్రాలు, బాక్సులు మాత్రం ఇలా పడి ఉన్నాయి. ఇది డైమండ్‌ హార్బర్‌లోని పరిస్థితి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. స్థానిక ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించే నేర చరితులను అరెస్ట్‌ చేయాలని సలీం డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పనితీరులో పారదర్శకత లోపించిందని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికలలో 747 జిల్లా పరిషత్‌ స్థానాలకు, 6,752 పంచాయతీ సమితి స్థానాలకు, 35,411 గ్రామ పంచాయతీ స్థానాలకు సీపీఐ (ఎం)పోటీ చేస్తోంది.

Spread the love