నేడు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాంకాళి బోనాలు

– రంగులతో ఆలయం ముస్తాబు
– ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నవతెలంగాణ-బేగంపేట
సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆషాఢమాస జాతరలో భాగం గా ఆదివారం బోనాలు, సోమ వారం రంగం కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ, జలమండలి, ఆర్‌ అండ్‌బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.మహాంకాళి దేవాలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు. దేవాలయం మొత్తం విద్యుత్‌ దీపాలు, పువ్వులు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవాలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, విద్యుత్‌ దీపాలు పెట్టారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించనున్నారు. అనంతరం హారతిలో పాల్గొంటారు. 4.15 నిమిషాలకు సందర్శకులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు.
6 లైన్లు ఏర్పాటు
బోనాల జాతరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా 6 లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి పాత రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌, మరొకటి బాటా వైపు నుంచి ఏర్పాటు చేశారు. అలాగే పాత రాంగోపాల్‌పేట్‌ వైపు ఒకటి సాధారణ ప్రజలకు, టొబాకో బజార్‌ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్‌ నుంచి వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి ఒకటి, సాధారణ ప్రజల కోసం మరో లైన్‌ ఏర్పాటు చేశారు. వీవీఐపీలు మాత్రం దేవాలయంలోకి నేరుగా వస్తారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భయటకు వెళ్లేందుకు గతంలో మూడు గేట్లు ఉండగా.. ఈ ఏడాది అదనంగా మరొక గేటు ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టు పక్కల 6 చోట్ల మంచినీటి శిబిరాలు ఏర్పాటు చేసి అందించనున్నారు. 7 లక్షల వాటర్‌ ప్యాకెట్లతో పాటు 250 ఎంఎల్‌ వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేయనున్నారు. మహాంకాళి పోలీస్‌ స్టేషన్‌, బొమ్మన బ్రదర్స్‌, సోలాపూర్‌ స్వీట్‌ హౌజ్‌ ప్రాంతంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి మందులు ఉచితంగా అందిస్తారు.

Spread the love