ఉపా చట్టాన్ని రద్దు చేయాలి అక్రమ కేసులను ఎత్తేయాలి

– నిర్బంధ వ్యతిరేక వేదిక రౌండ్‌ టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ- బంజారాహిల్స్‌
ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్బంధ వ్యతిరేక వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా నాయకులు వి.ప్రవీణ్‌, టీజేఎస్‌ వ్యవస్థాపకులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, వీసీకే జీలకర్ర శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ గడ్డం, ప్రొఫెసర్‌ పద్మశాస, ప్రొఫెసర్‌ ఖాతను మాదినేని విద్మహే, ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ అన్వర్‌ అలీ ఖాన్‌, ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, పీడబ్ల్యూ సంధ్య, అనురాధ, పుష్ప, స్వరూప, కన్యం గడ్డం రవి, ఎం.రాఘవచారి, కె.రవీందర్‌, టీవీఎస్‌ కోటా శ్రీనివాస్‌ గౌడ్‌, డీడీఎం రాజు, విరగం పాణి, తదితరులు మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోందన్నారు. సభలు, సమావేశాలు జరగనీయకపోవడం, మంత్రులు, ముఖ్యమంత్రి వివిధ జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించడం, వారి నివాసాలను టార్గెట్‌ చేసి దాడులు చేయడం, ప్రభుత్వ సంస్థలను వినియోగించి రైడ్‌లు చేయడం వంటి కార్యకలాపాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించడమే ప్రజాస్వామిక విధానంలో ప్రజాసంఘాల నాయకులు, సామాజికవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, జర్నలిస్టుల తప్పైపోతుందన్నారు. టీఎస్పీఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాను ఎత్తేయాలని సుప్రీంకోర్టు స్వయంగా సూచించినా అమలుకు నోచుకోలేదన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా స్వామిక చైతన్యాన్ని అణచివేసే పాలన సాగుతోం దన్నారు. ప్రజాస్వామిక నిర్బంధం ఎంత తీవ్రమో ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే నివ్వెరపోతారన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌ స్టేషన్‌లో 59 మంది, వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో 120 మంది, తాడ్వాయిలో 152 మంది, భద్రాద్రి కొత్తగూడెం చర్ల పోలీస్‌ స్టేషన్‌లో 24 మంది, భద్రగూడెంలో 80 మంది, లక్ష్మీదేవపల్లిలో 24 మంది, హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో 86 మంది, చిక్కడపల్లిలో 20మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 37 మందిపై ఇష్టానుసారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా రాజ్యాంగ ఉల్లంఘన ను చేయకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఉపా చట్టాన్ని ఎత్తేయాలని కోరారు. ప్రజాస్వామిక జీవితంలో వారికున్న హక్కులను కాలరాయొద్దని సూచిస్తూ తీర్మానం చేశారు. లేదంటే గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు.

Spread the love