రేపు ఎంసెట్‌ ఫలితాలు

– 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంసెట్‌ రాతపరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈనెల 10,11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం, 12 నుంచి 14వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్‌కు 3,20,683 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, వారిలో 3,01,789 (94.11 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 18,894 మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి 2,48,479 మంది దరఖాస్తు చేయగా, 2,35,918 (94.94 శాతం) మంది పరీక్ష రాశారు. 12,561 మంది హాజరు కాలేదు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేస్తే, 65,871 (91.23 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 6,333 మంది గైర్హాజరయ్యారు.

Spread the love