బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు ప్రతిపక్షాల అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు

– పేట్రేగిపోతున్న తృణమూల్‌ గూండాలు
– ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
కొల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడంచెల పంచాయతీ రాజ్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు దగ్గరపడుతున్న కొద్దీ తృణమూల్‌ గూండాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నామినేష్ల దాఖలు సమయంలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను అడ్డుకోడానికి యథేచ్ఛగా బెదిరింపులు, దాడులకు తెగబడిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్నికల ప్రచారాన్ని కూడా హింసాత్మకంగా మార్చేసింది. బెంగాల్‌లోని 20 జిల్లా పరిషత్‌లకు చెందిన 825 జెడ్‌పిటిసిలకు, 341 పంచాయతీ సమితులకు చెందిన 9,240 సమితి మెంబర్ల స్థానాలకు, 3,354 గ్రామ పంచాయతీలకు చెందిన 48,751 వార్డు స్థానాలకు ఈ నెల8న ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఫలితాలు 11న వెలువడతాయి.
ప్రతిపక్ష అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు
ఎన్నికల ప్రచార సందర్భంగా తృణమూల్‌ దుండగులు సాగిస్తున్న ఎడాపెడా దాడులకు సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ కు చెందిన పలువురు కార్యకర్తలు చనిపోయారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లా సబాంగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బల్పారు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇద్దరు సిపిఐ(ఎం) అభ్యర్థులపై సోమవారం తృణమూల్‌ దుండగులు బాంబులు, తుపాకులతో దాడి చేశారు. వీధి మీటింగ్‌ కోసం వేసిన కుర్చీలు, బల్లలను ధ్వంసం చేశారు.. సైకిళ్లను ఎత్తుకుపోయారు. ఈ దాడిలో ఇద్దరు అభ్యర్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.
రారుగంజ్‌ పంచాయితీలో ఎన్నికల నామినేషన్‌ వేయకుండా అడ్డుకోడానికి తృణమూల్‌ బెదిరింపులకు దిగింది. అయినా లెక్కచేయకుండా సిపిఐ(ఎం) అభ్యర్థి మన్సూర్‌ ఆలం నామినేషన్‌ వేయడానికి వెళ్తుండగా ఆయన తలకు గురిపెట్టి తృణమూల్‌ దుండగులు కాల్పుఉ జరిపారు. ఈ దాడిలో గాయపడి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆలం సోమవారం చనిపోయారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దస్పర పోలీస్‌ అవుట్‌ పోస్టు ఎదుట రహదారిపై సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారం రోజుల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా హరోవాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన బాంబు పేలుడులో ఒకరు మరణించారు. పొలంలో బాంబులు తయారు చేస్తుండగా అవి పేలడంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లోని ముఠా ఆధిపత్య పోరులో భాగంగానే బాంబులు తయారు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా వుండగా తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలో బిజెపి గూండాలు బెదిరింపులు, మానసిక వేధింపులకు ప్రతిపక్షాలకు చెందిన 74 ఏళ్ల సిపిఎం అభ్యర్థి చనిపోయారు.
బీర్బుమ్‌ ఎంపి శతాబ్ది రారుకు నిరసన సెగ
బీర్బుమ్‌కు చెందిన తృణమూల్‌ ఎంపి శతాబ్ది రారుకు నిరసన సెగ తగిలింది. సోమవారం ఆమె ప్రయాణిస్తున్న కారును గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వర్షాకాలం వస్తే మురుగు నీటి కాల్వలు పొంగి పొర్లుతూ ఇళ్లల్లోకి వస్తుందని, ఈ విషయమై స్థానిక పంచాయతీ ప్రధాన్‌కు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిగా ఎన్నికైన తరువాత ఒక్కసారి కూడా తమ ప్రాంతం వైపు తొంగి చూడని ఎంపీని వారు నిలదీశారు. చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్న వంతెన స్థానే కొత్త వంతెన కట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

Spread the love