విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి

– నియంత్రణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే…
– సమీక్షా సమావేశంలో
మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పైచేయిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. నకిలీ విత్తనాల బెడద సంపూర్ణంగా నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలిచేయవద్దనీ, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. కర్నాటక, కర్నూలు, గద్వాల, గుంటూరు, ప్రకాశం, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, గుజరాత్‌, జహీరాబాద్‌ మీదుగా వచ్చే దారులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందన్నారు. హెచ్‌టీ పత్తి విత్తనాల విషయంలో రైతులను చైతన్యం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో కనిపించే చిన్న, చిన్న లోపాలు, తప్పిదాలపై కఠినంగా వ్యవహరించకుండా వ్యాపారులు, విత్తన వ్యాపారులకు సమయం ఇచ్చి సరి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలను తెలంగాణ అందిస్తున్నదనీ, ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కోరారు. వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలానికి పత్తి, మిరప, కందులు, వరితోపాటు మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా ఉందన్నారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీవీ ఆనంద్‌, సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, డీఐజీ షానవాజ్‌ ఖాసీం, డీఐజీ ఇంటలిజెన్స్‌ కార్తికేయ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హన్మంత్‌ కొడిబ, ఉద్యాన శాఖ డైరెక్టర్‌ హన్మంతరావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, సీడ్స్‌ ఎండీ కేశవులు, అడిషనల్‌ డీఏ విజరుకుమార్‌, రిజిస్ట్రార్లు సుధీర్‌ కుమార్‌, భగవాన్‌, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఓలు, అన్ని స్థాయిల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love