భూమితో విడదీయరాని బంధం

– భూమికోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది :రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో మంత్రి నిరంజన్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
తెలంగాణ ప్రాంతానికి, భూమికి విడదీయరాని బంధం ఉందని, భూమి కోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ నేడు తెలంగాణా సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, నిరంతర విద్యుత్‌, మిషన్‌ కాకతీయ, వంటి ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రైతుబంధు వంటి ప్రోత్సాహకాల వలన గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తనకి చిన్నప్పుడు రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాలలో చదవాలన్న కోరిక ఉండేదని కానీ అప్పుడు సీటు రాలేదన్నారు. ఇప్పుడు మంత్రి హౌదాలో విశ్వవిద్యాలయానికి వస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. టీఎస్‌టీ ఎస్సీ మాజీ చైర్మన్‌ గంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు, వ్యవసాయం చుట్టూ తిరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హార్టికల్చర్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఆయిల్‌ పామ్‌ సలహాదారు శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మిబాయి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love