తొమ్మిదేండ్లు గడిచినా ఆర్టీసీ కార్మికుల కష్టాలు పోలేదు

– తక్షణమే వారి సమస్యలు పరిష్కరించండి :సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తొమ్మిదేండ్ల పాలనలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీరలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని విజ్జప్తి చేశారు. ఈమేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల ఏడాదిలో కేవలం హామీల పేరుతో మరొకసారి ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేయకుండా ప్రగతి భవన్‌ వేదికగా ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల కోరారు. ఆర్టీసీలో ఖాళీలు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ ఎందుకు నియామకాలు చేపట్టలేదో తెలపాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలల్లో ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తానంటూ చెప్పి ఏండ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. పీిఎఫ్‌, సీసీఎస్‌ బకాయిలు పేరుకుపోతున్నప్పటికీ ఈ నిధులను విడుదల చేయడంలో సీఎంతోసహా అధికారులు సైతం శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత బస్సు పాసులు, ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయం, ఉద్యోగులకు గృహ నిర్మాణం హామీలు విస్మరించారని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం యుద్ధంలో తమ వీరత్వాన్ని చూపిన ఆర్టీసీ కార్మికుల త్యాగాలను గుర్తించి వారిని ఆదుకోవాలనీ, వారి సమస్యలను తీర్చి, డిమాండ్లను నెరవేర్చి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాదర్భార్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితం
టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్‌
ప్రజా దర్బార్‌ ప్రచార ఆర్భాటామంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ చెప్పారు. ఆయన అవివేకానికి, అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేటీఆర్‌ దుందుడుకు తనంతో మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాదర్బార్‌లో ఎంతో మంది మేధావులు, వివిధ రంగాలలోని నిష్ణాతులు తమ సూచనలు, సలహాలు సీఎంకు ఇచ్చే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు.

Spread the love