బీజేపీని బలహీనపర్చేలా కేసీఆర్‌ కుట్ర

– మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనీ, ప్రచార కమిటీ చైర్మెన్‌గా ఈటల రాజేందర్‌ నియమితులు కాబోతున్నారనే వార్తల వెనుక కేసీఆర్‌ కుట్ర ఉందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పార్టీలో విభేదాలుంటే తామే పద్ధతి ప్రకారం పరిష్కరించుకుంటామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో సీనియర్‌ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో ఇప్పటివరకూ ప్రచార కమిటీ అనే వ్యవస్థనే లేదని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉన్నందుకే కేసీఆర్‌ ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసిన తర్వాతనే అధ్యక్ష ఎన్నిక ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మీడియాలో బీజేపీ నాయకత్వ మార్పు, కొత్త పదవులపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
అధ్యక్ష పదవి మార్పుపై లీకేజీలు సరిగాదు : విజయశాంతి
రాష్ట్రంలో తమ పార్టీ అధ్యక్షడుగా బండి సంజరుని మారుస్తున్నారని మీడియా లీకేజీలు సరిగాదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ బండి సంజరునే కొనసాగుతారని తరుణ్‌చుగ్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. నేతల భేటీలపై వస్తున్న ఊహాగానాలు అధికారిక ప్రకటనలు కావని తెలిపారు. తమ పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే కచ్చితమైన సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. ఊహాగానాల వార్తల ప్రభావం తమ పార్టీపై ఉండబోవని పేర్కొన్నారు.

 

Spread the love