ఇంటిని చల్లగా ఉంచండిలా..

ఎండ వేడిని తట్టుకోవాలంటే ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్‌, ఏసీ, కూలర్‌ వంటివి తప్పనిసరి అయ్యాయి. అందుకే ఈ సీజన్‌లో కరెంటు బిల్లు కూడా బాగానే వస్తుంది. అయినా ఆ చల్లదనం ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు.. కానీ తప్పనిసరి… ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందడానికి ఇంటిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. కరెంటు బిల్లునూ తగ్గించుకోవచ్చు. ఇంటిని సహజంగా చల్లగా ఉంచడానికి ఈ చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటంటే…
– టెర్రస్‌, బాల్కనీల్లో మొక్కలు నాటండి. తక్కువ మొక్కలు, చెట్లు ఉన్న ప్రదేశాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటండి.. చెట్లు పెంచండి.
– మొక్కను పెంచడానికి ఉపయోగించే నేల ఇంట్లోకి వచ్చే సూర్య కిరణాలను గ్రహిస్తుంది. దాని వల్ల ఇల్లు ఎక్కువ శాతం వేడిగా ఉండదు. దీనితో పాటు మొక్కలు, చెట్లు ఉన్న పరిసరాలలో వేడి గాలుల ప్రభావం అంతగా ఉండదు. వేడిని ఇంట్లోకి రానివ్వకుండా అవి అడ్డుకుంటాయి. దీని వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.
– ఇంట్లో ఉపయోగించే కర్టెన్లు దుమ్మును ఇంట్లోకి రానివ్వకుండా ఆపడంతో పాటు, వేడిగాలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. అయితే మామూలు కరెన్లకు బదులుగా వెదురు కర్టెన్లు ఉపయోగించాలి. ఇవి ఇంటిని చల్లగా ఉంచడంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి. వెదురు కర్టెన్లు ఉపయోగించే అవకాశం లేని పక్షంలో ముదురు రంగు కర్టెన్లనైనా ఉపయోగించవచ్చు.
– సూర్యోదయం అయిన కొంత సేపటి వరకు, సూర్యాస్తమయం అయిన తర్వాత కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. వేసవిలో సహజమైన చల్లని గాలి ఇంట్లోకి వచ్చేలా, ఇంటిని వీలైనంత వరకు తెరిచి ఉంచడం వల్ల ఇంటిలోపలి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఫలితంగా కూలర్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
– ఈ రోజుల్లో ప్రతి దానికి విద్యుత్‌ వస్తువుల వినియోగం బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు వాషింగ్‌ మెషీన్‌, వాషింగ్‌ మెషీన్‌ డ్రయర్‌, ఓవెన్‌ వంటి వాటి వాడకం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులు వేడిని ఎక్కువగా విడుదల చేస్తాయి.
– ఇంటిలో వస్తువులను చిందరవందరగా ఉంచకండి. ఇలా ఉంచడం వల్ల వేడి పెరుగుతుంది. ఇల్లంతా శుభ్రంగా సర్దుకుంటే ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే అంత చల్లదనంగా ఉన్న భావన కలుగుతుంది.
– సీలింగ్‌కు వైట్‌వాష్‌ ఉపయోగించడం ద్వారా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. అవకాశం ఉంటే పైకప్పుపై తెల్లటి సున్నంతో పెయింట్‌ చేయించుకుంటే చల్లగా ఉంటుంది.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.

Spread the love